పోలవరం ఖర్చు మొత్తం కేంద్రమే భరించేలా ఒప్పించడం ఘన విజయం. ఇదే ప్యాకేజీలో అతి గొప్ప విషయం. ఏడాది కిందట హౌరెత్తిన ప్రచారం, శాసనసభలో కీర్తన తీర్మానం ఎవరు మర్చిపోతారు? కాని వాస్తవం ఏమిటో ఇప్పుడు సాక్షాత్తూ సంబంధిత మంత్రి నోటి వెంటనే వచ్చింది. విభజన బిల్లులోనే పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా తీసుకోవాలని వుంది. కనుక ఆ ఖర్చు భరించడం కొత్తది కాదు. అయితే జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం తీసుకుంటే ఆలస్యం అవుతుంది గనక మేమే చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఒప్పించింది. అయితే నిధులు ఇవ్వడం గాక మీరు అప్పు తెచ్చుకుంటే కేంద్రం చెల్లిస్తుందని రాసుకున్నారు. నాబార్డుకు ఆ బాధ్యత ఇచ్చారు. ఇదంతా బాగానే వుంది. ఈ ఏడాదిలో రాష్ట్రం 4000 కోట్లు ఖర్చు చేసిందట. ఇది మొత్తం ఖర్చులో పదో వంతు. కాగా ఇందులో నాలుగో వంతు మాత్రమే కేంద్రం మంజూరు చేసింది. ఇప్పటికి నాబార్డు 1000 కోట్టు విడుదల చేసినట్టు నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్వయంగా చెప్పిన మాట. మిగిలిన నిధుల కోసం నివేదిక పంపిస్తామని సెలవిచ్చారు. మరివారెప్పుడు నిధులిస్తారో తెలియదు. అసలు ప్రాజెక్టు నిర్మాణ బాద్యతలు చూస్తున్న ట్రాన్స్ట్రారుతో వివాదం కారణంగా వారు చేయక మరొకరిని చేయనివ్వక అదో సమస్య సాగుతూనే వుంది. అయినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 2018నాటికి గ్రావిటీతో నీళ్లు విడుదల చేయడం అంటూ చెబుతూనే వుంటుంది, మనం వింటూనే వుంటాం. పురుషోత్తమ పట్నంలోనే నీటిని విడుదల చేశాక వారానికి గాని రాలేదు. పోలవరంలో అదే మరో ప్రచార ప్రహసనంగా చూపించి మురిపించవచ్చు. సాంకేతికంగా పూర్తి కావడం ఎవరికి తెలుస్తుంది? ఏదోలా నీరు పారిస్తారు.