ఎమ్మెల్యే రోజా అనగానే ఫైర్ బ్రాండ్ అనే ఒక ముద్ర పడిపోయింది! ఆమె విమర్శలకు దిగితే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపైనా, తెలుగుదేశం నాయకులపైనా వ్యక్తిగత స్థాయిలో విమర్శలు చేయాలంటే ఆమె తరువాతే ఎవరైనా..! నిజానికి, వైకాపాకి రోజా ఒక బలమైన వాయిస్. అయితే, ఆ వాయిస్ శృతిమించిన సందర్భాలు ఈ మధ్య ఎక్కువగా చూశాం. నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా మంత్రి భూమా అఖిల ప్రియను ఉద్దేశించి రోజా చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. ఉప ఎన్నికలో తెలుగుదేశం మెజారిటీ పెంచడానికి రోజా వ్యాఖ్యలు కూడా ఒక కారణం అని విశ్లేషకులు కూడా తప్పుబట్టారు. అయితే, వైకాపా మాత్రం ఇన్నాళ్లూ ఆమె తీరును వెనకేసుకుంటూనే వచ్చింది. కానీ, తాజా సమాచారం ప్రకారం నంద్యాల, కాకినాడ ఫలితాల అనంతరం రోజా తీరుపై ప్రతిపక్ష పార్టీలో చర్చ జరిగిందని తెలుస్తోంది.
నంద్యాల, కాకినాడ ఓటమి వెనక ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యలు కూడా కొంతమేరకు పనిచేశాయనే అభిప్రాయం జగన్ కు కలిగిందని సమాచారం. అందుకే, ఇకపై ఆమెను కాస్త అదుపులో ఉంచాలని పార్టీ సీనియర్ నేతలతో జగన్ చెప్పారట. సీనియర్ నేతలు భూమాన కరుణాకర్ రెడ్డి, ఉమారెడ్డి వెంకటేశ్వర్లతోపాటు మరో ముగ్గురుతో ఒక కమిటీని ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే రోజాకి క్లాస్ తీసుకునే బాధ్యత ఈ కమిటీకి అప్పగించారట! సదరు కమిటీ ముందు రోజా ఇటీవలే హాజరైనట్టు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా రోజా చేసిన వ్యాఖ్యల్ని ఈ కమిటీ ఆమె ముందు ప్రస్థావించిందట. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే పార్టీకి ఇబ్బందికరంగా మారతాయని ఆ కమిటీలోని సీనియర్లు క్లాస్ తీసుకునేసరికి, రోజా తీవ్ర ఆగ్రహానికి గురయ్యారనీ పార్టీ కోసం తాను ఎంతో చేస్తుంటే ఇప్పుడు ఇలా వ్యవహరిస్తున్నారేంటీ అంటూ ఆమె కోపంతో అక్కడి నుంచి లేచినట్టు సమాచారం. లోటస్ పాండ్ లో జరిగిన సమావేశంలో సీనియర్ నేతలపై ఆమె తన చేతిలో ఉన్న కాగితాలను విసిరేసి, ఇకపై తాను నియోజక వర్గానికే పరిమితం అవుతాననీ, తన తలరాత ఎలా ఉంటే అలానే జరుగుతుందంటూ ఆవేదనతో అక్కడి నుంచి వెళ్లిపోయినట్టు పార్టీ వర్గాలు ఇప్పుడు చెబుతున్నాయి.
నిజానికి, ఈ పనేదో ముందే చేస్తే పరిస్థితి ఇక్కడివరకూ వచ్చేది కాదు. గతంలో అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి రోజా ప్రదర్శించిన హావభావాలు సరిగా లేవు. ఆమె తీరును అందరూ లైవ్ లో చూశారు. దాంతో శాసన సభ సమావేశాల నుంచి ఆమెను కొన్నాళ్లు బహిష్కరించారు. అలాంటప్పుడే ఆమెకు క్లాస్ తీసుకోవాల్సింది. కనీసం, నంద్యాల ప్రచార పర్వం సమయంలోనైనా అఖిల ప్రియ కట్టూ బొట్టూ గురించి మాట్లాడినప్పుడైనా సీనియర్ నేతలు ఆమెతో మాట్లాడి ఉండాల్సింది. ఆ సమయంలో రోజా వ్యాఖ్యల వల్ల పార్టీకి మేలు జరుగుతుందేమో అని ఆశించారేమో మరి. తీరా అవి బెడిసికొట్టేసరికి, ఇప్పుడు ఫైర్ తగ్గించుకోవాలంటూ రోజాకి హితబోధ చేస్తున్నారు. నిజానికి, నంద్యాల, కాకినాడ ఓటమి తరువాత రోజా మీడియా ముందుకు రాలేదు. ఫలితాలను విశ్లేషించే ప్రయత్నం కూడా ఆమె చెయ్యలేదు. పార్టీలో ఆమె వ్యవహార శైలి చర్చ జరుగుతోందని అప్పుడే అన్నారు. పార్టీ కోసం తాను ఎంతో చేస్తుంటే, ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చిందేంటంటూ ఆమె ఆవేదన చెందుతున్నారట. మరి, రోజాను ఎలా బుజ్జగిస్తారో కూడా వేచి చూడాలి.