లోక్ సత్తా పార్టీ. 2004 ఎన్నికల్లో ఉమ్మడి ఏపిలో పోటీ చేసి, టిడిపి, కాంగ్రెస్, పీఅర్ పి ల త్రిముఖ పోటీ లోనూ 1.4% ఓట్లని సాధించిన పార్టీ. గెలిచింది ఒక్క ఎమ్మెల్యే సీటే అయినా, ప్రజల్లో ఆ పార్టీ మీద ఉన్న సాఫ్ట్ కార్నర్ ని మాత్రం చెడగొట్టుకోలేదు. కానీ 2014 ఎన్నికల అనంతరం జయ ప్రకాశ్ నారాయణ తాను ప్రత్యక్ష రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. లోక్ సత్తా లో కూడా విభేధాలున్నాయని వార్తలొచ్చాయి. ఆ తర్వాత ఆ పార్టీ కూడా పెద్దగా ఏ యాక్టివిటీ చేయకపోవడం తో ప్రజలూ మరిచిపోయారు ఆ పార్టీ ని. సడెన్ గా ఇప్పుడు సురాజ్య యాత్రలు మొదెలెట్టింది లోక్ సత్తా పార్టీ. అదీ జయ ప్రకాశ్ నారాయణ ఆధ్వర్యం లో. ప్రజలని చైతన్యవంతం చేయడానికే ఈ యాత్ర అని చెబుతున్నపటికీ ఇది రాజకీయ యాత్రేనని అంగీకరించక తప్పదు.
అయితే ఉన్నట్టుండి లోక్ సత్తా యాక్టివ్ అవడానికి కారణం పరోక్షంగా జనసేనేనంటున్నాయి కొన్ని వర్గాలు. గత ఎన్నికల్లో టిడిపి బిజెపి తరపున ప్రచారం చేసిన పవన్ ఈ సారి, బిజెపి తో తెగతెంపులు చేసుకుంటాడని, ప్రత్యేక హోదా ఇవ్వకపోవడమే దానికి కారణమనీ ప్రచారం జరుగుతోంది.ఒకవేళ అదే జరిగితే పవన్ టిడిపి తో ఉండడని, సొంత కూటమి తో వస్తాడనీ తెలుస్తోంది. అందులోనూ పవన్ అప్పుడే కమ్యూనిస్ట్ పార్టీలతో కలిసి వెళ్ళబోతున్నట్టు స్పష్టమైన సంకేతాలిచ్చాడు. అయితే కమ్యూనిస్టు పార్టీల తో పాటు లోక్ సత్తా కూడా జనసేన కూటమి లో ఉంటుందన్న ప్రచార మాత్రం బాగానే జరుగుతోంది. ఈ నేపథ్యం లోనే, అనుకోకుండా వచ్చిపడ్డ ఈ అవకాశం వల్లే లోక్ సత్తా కూడ తమలో ఉన్న విభేదాలని పక్కనపెట్టి, మళ్ళీ యాక్టివ్ అయిందని, సురాజ్య యాత్ర తో మళ్ళీ ప్రజలకి దగ్గరవాలని ప్రయత్నిస్తోందనీ తెలుస్తోంది.
నిజానికి, 2009 కంటే లోక్ సత్తా లాంటి పార్టీ లకి ఇప్పుడు మంచి పరిస్థితులు ఉన్నాయి. అప్పటితో పోలిస్తే ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావం చాలా పెరిగింది. ఎక్కువ డబ్బు ఖర్చు లేకుండానే సోషల్ మీడియా ద్వారా ప్రజలకి దగ్గరయ్యే అవకాశం ఉందిప్పుడు. చూద్దాం, లోక్ సత్తా, జయ ప్రకాశ్ నారాయణ ల తదుపరి గమనం ఎలా ఉండబోతోందో!!!