సామాజిక సమీకరణాల ప్రభావం లేకుండా ఏ పార్టీ ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేని పరిస్థితి! ఆంధ్రప్రదేశ్ లో కుల సమీకరణాలకే పెద్ద పీట పడుతున్న రోజులివి! ముఖ్యంగా, కాపు సామాజిక వర్గాన్ని తమవైపు ఆకర్షించడం కోసం ప్రముఖ పార్టీలన్నీ కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. అందుకే, కాపుల రిజర్వేషన్ల అంశాన్ని ఎంతో సున్నితంగా డీల్ చేసుకుంటూ వస్తున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. కాపు కార్పొషన్ కు భారీ నిధులు కేటాయించడం, ఆ సామాజిక వర్గానికి చంద్రన్న పెళ్లి కానుకలు వంటి జనాకర్షక పథకాలు వర్తింపజేయడం, విదేశీ విద్య ప్రోత్సాహం ఇలాంటివి చాలానే చేస్తున్నారు. ఇప్పుడు భాజపా కూడా కాపు సామాజిక వర్గం మీదే ప్రత్యేక దృష్టి పెట్టబోతోంది. రాష్ట్రంలో పార్టీని సొంతంగా పైకి తీసుకుని రావాలన్న ఉద్దేశంతో భాజపా ఉంది!
అయితే, తెలుగుదేశం పార్టీతో పొత్తు విషయమై ఇంకా స్పష్టత లేదనే చెప్పాలి. 2019 వరకూ టీడీపీతో ప్రస్తుతం ఉన్న పొత్తు కొనసాగుతుందని పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆ మధ్య చెప్పారు. ఆ తరువాత, జరిగే ఎన్నికల పరిస్థితి ఏంటనేది అప్పుడే చూసుకుందాం అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. అయితే, ఏపీలో మాత్రం అంతకంటే ముందే ఎన్నికలు వచ్చే వాతావరణం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో భాజపా రాష్ట్ర అధ్యక్ష పదవి ఎవరికి ఇవ్వాలనే చర్చ ఈ మధ్య జరుగుతూనే ఉంది. నంద్యాల ఉప ఎన్నిక ఫలితం తరువాత భాజపా కూడా కుల సమీకరణలపైనే ప్రత్యేక దృష్టి పెట్టినట్టు సమాచారం. ఆంధ్రాలో దాదాపు 12 శాతం కాపు సామాజిక వర్గం ఓటర్లు ఉన్నారు కాబట్టి, భాజపా అధ్యక్ష పదవి కూడా ఆ వర్గానికి చెందినవారికే ఇస్తే బాగుంటుందనే అభిప్రాయం కమలనాథుల్లో వ్యక్తమౌతోందట. ఈ నేపథ్యంలో కన్నా లక్ష్మీ నారాయణ పేరు ప్రముఖంగా వినిపిస్తూ ఉండటం విశేషం.
కన్నాతోపాటు సోము వీర్రాజు, ఆకుల సత్యనారాయణ పేర్లు కూడా ఈ మధ్య చక్కర్లు కొడుతున్నారు. ఓ దశలో దగ్గుబాటి పురందేశ్వరి పేరు కూడా తెర మీదికి వచ్చింది. అయితే, నంద్యాల ఉప ఎన్నికల ఫలితం తరువాత కాపులకే ప్రాధాన్యత ఇస్తే బాగుంటుందనే చర్చ భాజపాలో జరుగుతోందని సమాచారం. దీంతోపాటు, తెలుగుదేశం పార్టీతో సత్సంబంధాలు కలిగినవారు ఉంటే బెటర్ అనే అభిప్రాయం ఉందట! ఎందుకంటే, 2019 ఎన్నికల అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి కదా! సోము వీర్రాజు గతంలో టీడీపీ సర్కారుపై విమర్శలు గుప్పించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ, ఇప్పుడు టీడీపీతో ఏపీలో అవసరం లేదనే పరిస్థితి భాజపాకి ఇంకా లేదు. కాబట్టి, వచ్చే ఎన్నికల్లో టీడీపీతోనే కొనసాగాల్సిన పరిస్థితి వస్తే ఏంటన్నది కూడా చూసుకోవాలి. అందుకే, భాజపా అధ్యక్షుడి ఎంపిక విషయంలో దీంతోపాటు ఒక బలమైన సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకునే ప్రయత్నంలో భాజపా ఉందని అంటున్నారు. ఇతర ప్రముఖ సామాజిక వర్గాలైన ఆ రెండూ రెండు పార్టీలకు కొమ్ము కాస్తున్నాయి. అందుకే, కాపుల వైపు తామున్నామనే నమ్మకం కలిగించే ప్రయత్నం భాజపా చేయబోతున్నట్టుగా చెబుతున్నారు. మరి, ఈ వ్యూహం ఎంతవరకూ వర్కౌట్ అవుతుందో వేచి చూడాలి. రాష్ట్ర అధ్యక్షుడిని ఎంపిక చేసినంత మాత్రాన, ఆ సామాజిక వర్గమంతా భాజపాని సొంతం చేసుకునే పరిస్థితి ఉంటుందా అనేదే అసలు ప్రశ్న?