తెలుగు భాషని ఉద్దరించడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నడుం కట్టారు. 12వ తరగతి వరకూ పాఠశాలల్లో తెలుగు బోధన తప్పనిసరి చేస్తున్నం అంటూ కొత్త జీవో ని తీసుకొచ్చే పనిలో తలమునకలయ్యారు కేసీఆర్. ఈ నిర్ణయం తెలుగు భాషపై ఆయనకున్న చిత్తశుద్దిని తెలియజేస్తోంది. ఎప్పుడైతే కేసీఆర్ ఇలాంటి నిర్ణయం తీసుకొన్నారో.. మాతృభాషపై మమకారం ఉన్నవాళ్లందరి మనసుల్ని గెలుచుకొన్న నాయకుడయ్యారు. సోషల్ మీడియాలో కేసీఆర్ నిర్ణయానికి హర్షం తెలియజేసేవాళ్ల సంఖ్య క్షణక్షణానికీ పెరుగుతోంది. ఇలాగైతే.. తమ ఓటు కేసీఆర్‌కే అంటూ.. సినీ సెలబ్రెటీలు కూడా మెచ్చుకొంటున్నారు.
ఆయన కాస్త.. తెలుగు సినిమాపైనా దృష్టి పెడితే బాగుంటుంది. ఈమధ్య ఏ సినిమా చూసినా పేర్లన్నీ ఇంగ్లీషులోనే ఉంటున్నాయి. వాటికీ జనాలు అలవాటు పడిపోతున్నారు. తెలుగు సినిమా పేరు కూడా తెలుగులోనే ఉండాలన్న షరతు విధిస్తే.. కనీసం తెలుగు సినిమా పోస్టర్లపైనైనా తెలుగు బతుకుతుంది. తమిళనాట ఈ సంప్రదాయం ఉంది. వాళ్ల పేర్లన్నీ తమిళంలోనే ఉండాలి. తమిళ సినిమాకి తమిళ పేరు పెడితే టాక్స్ లో మినహాయింపు ఇస్తుంది అక్కడి ప్రభుత్వం. తెలుగులోనూ అలాంటి ప్రయత్నం ఏమైనా చేస్తే.. ఉపయుక్తంగా ఉంటుంది. ఇప్పుడు తెలుగు సినిమా అంటే .. రెండు తెలుగు రాష్ట్రాలు కూడా. ఇటు కేసీఆర్ అదరగొట్టే నిర్ణయం తీసుకొన్నారు. మరి అటు.. చంద్రబాబు నాయుడు కూడా ఇలాంటి ధీటైన నిర్ణయం తీసుకొంటే… తెలుగు సినిమా ఉద్ధరణకు ఇతోదికంగా సాయం చేసినవాళ్లవుతారు.