కాపు రిజర్వేషన్ల సమస్యపై 2017 డిసెంబరులోగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నట్టు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం స్పష్టంగా ప్రకటించారు. గతంలో మూడు మాసాల విరామం అన్న ముద్రగడ ఇప్పుడు డిసెంబరు అనడం అంటే ఒక నెల అదనం. పైగా అప్పటికి కొత్త సంవత్సరం ఎన్నికల వాతావరణం వచ్చేస్తాయి. ఒకసారి విరామం ఇచ్చాక మధ్యలో తీవ్రమైన కార్యాచరణ చేపట్టే అవకాశం వుండదు. అంటే ముద్రగడ వ్యూహాత్మకంగా అనివార్యంగా ఈ నిర్ణయం ప్రకటించినట్టు భావించాలి. ఏమంటే మాటిమాటికి ఏదో ఒక ఆందోళన కార్యక్రమం ప్రకటించడం, ప్రభుత్వం పోలీసుల ప్రవేశం, హడావుడి తప్ప నిజంగా ఒరిగిందేమీ లేదనీ, పైగా ఉద్యమం ఉధృతి తగ్గుముఖం పట్టినట్టు కనిపిస్తుందని విమర్శలు రావడంతో ముద్రగడ ఇలాటి నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. మరోవైపున ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం కాపునేతలతో పదేపదే సమావేశాలు జరుపుతూ తెలుగుదేశం పట్టు బిగించడానికి వ్యూహాలకు పదును పెడుతున్నారు. నంద్యాల కాకినాడ ఎన్నికల విజయాలు టిడిపికి వూపు నిచ్చాయి.మరోవైపున స్వంత జిల్లాలో కాపులు ఎక్కువగా వున్నచోట పెద్ద ప్రభావం చూపలేకపోవడం ముద్రగడ జోరుకు కొంచెం పగ్గాలు వేసి వుంటుంది. ఏమైతేనేం.. కొద్ది మాసాలు ఆ సమస్య వుండదు. పోలీసుల మొహరింపు నిర్బంధాలూ కూడా ఆ మేరకు తగ్గుతాయనుకోవాలి.