కొన్నిసార్లు సరదాగా అనేమాటల్లోనే సందేహాలు బయిటపడుతుంటాయి. తాము అమలు చేస్తున్న పథకాలు సంక్షేమ కార్యక్రమాల కారణంగా 175 నియోజకవర్గాల్లోనూ టిడిపినే గెలుస్తుందని సెప్టెంబరు8న మంత్రి లోకేశ్ విజయవాడ సమీపంలో జరిగిన ఒక కార్యక్రమం సందర్భంగా ఒక ఛానల్‌కు చెప్పారు. కాస్త అతిశయోక్తిగా అనిపించినా అధికార పక్షం ప్రచారం అని అందరూ సరిపెట్టుకున్నారు. కుమారుడి ఆత్మవిశ్వాసానికి ఆనందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తమకు 175 స్థానాలు వచ్చేస్తాయని ప్రకటించారు. దాంతో భాగస్వామ్యపక్షమైన బిజెపి కాస్త కంగారు పడింది. అన్నిచోట్లా మీరే వస్తారా లేక మాతో కలిసి చెబుతున్నారా అంటూ లా పాయింటు లేవదీశారు బిజెపి శాసనసభా పక్ష నేత విష్ణుకుమార్ రాజు. అయితే ఈ ప్రశ్నకు సమాధాం ఇచ్చేలోగానే లోకేశ్ మాట కొంచెం మారింది. తాను శాసనసభ్యుడినై మంత్రినవుతానో లేక ఎంఎల్సిగానే వుండిపోతానే తేల్చవలసింది మీరేనని ఆయన అధికారులతో అంటున్నారు. విజయనగరం పర్యటనలో మాట్లాడుతూ లోకేశ్ ఎన్నికలకు 18 మాసాలే వుంది గనక ఈ లోగానే బాగా పని చేసి ప్రజల విశ్వాసం పొందాలని హెచ్చరించినంత పని చేశారు. ఒకే విషయమై వారంరోజుల్లో పాలక కూటమి నుంచి నాలుగు మాటలు వస్తే ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారు మరి! మా భవితవ్యం మీ చేతుల్లో వుందని అధికారులకు చెబుతున్న లోకేశ్ వాస్తవానికి విధాన నిర్ణయాలతో అసలు ప్రభావం చూపేది తామేనని మర్చిపోతున్నారా? లేక నాన్నగారిలా మరింతగా పరుగులు పెట్టించేందుకు అలా అంటున్నారా? ఏమో మరి.