తెలంగాణలో రాజకీయాల్లో సర్వేల చర్చ ఈ మధ్య ఎక్కువైపోయింది. అధికార ప్రతిపక్ష పార్టీలు పోటీలు పడుతూ ఏదో ఒక సర్వే చేయించామని ప్రకటించడం, దాన్ని బహిర్గతం చేయడం రొటీన్ అయిపోయింది! ఇప్పటికే, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతీ మూడు నెలలకో సర్వే బయటపెడుతూ వస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించినా దాదాపు వందకుపైగా స్థానాల్లో తెరాస గెలుస్తుందని ఆయన గత సర్వే చెప్పింది. అంతేకాదు, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి రెండంటే రెండు స్థానాలు కూడా దక్కే అవకాశం లేదని కూడా తేల్చి చెప్పిన సందర్భాలూ ఉన్నాయి. సిటింగులందరికీ మళ్లీ టిక్కెట్లు ఇస్తామని ఈ మధ్యనే ప్రకటించారు. అయితే, రాబోయే నాలుగు నెలల పనితీరు ఆధారంగా మరోసారి సర్వే నిర్వహించి మార్కులేస్తామనీ, దాని ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుందనే మెలిక పెట్టారు. ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ పార్టీ కూడా మరోసారి సర్వే అంటూ కొత్త హడావుడి మొదలుపెట్టింది.
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గతంలో ఓ సర్వే చేయించారు. తెరాస ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందనీ, తెలంగాణలో కాంగ్రెస్ గెలవడం ఖాయమని ఆయన బల్లగుద్దేశారు! సరే, దీనికి కౌంటర్ గా కేసీఆర్ కూడా ఇంకో సర్వే తెరమీదికి తెచ్చారు. అయితే, ఇప్పుడు కాంగ్రెస్ నుంచి మరో కొత్త సర్వే వెలుగులోకి వచ్చింది. విచిత్రం ఏంటంటే.. దీన్ని రాష్ట్ర నేతలు ఎవ్వరూ చేయించలేదట! ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ స్వయంగా తెలంగాణలో ఈ సర్వే చేయించుకున్నారట! రాష్ట్ర నాయకులతో ఏమాత్రం సంబంధం లేకుండా ఈ మధ్యనే ఓ బృందాన్ని తెలంగాణకు రాహుల్ గాంధీ పంపించారనీ, వారు నిర్వహించిన సర్వేలో కూడా కాంగ్రెస్ సునాయాసంగా అధికారంలోకి రావడం ఖాయం అని తేలిందని ప్రకటించారు. రాహుల్ తాజా లెక్కల ప్రకారం తెలంగాణలో కాంగ్రెస్ కు 70 నుంచి 80 స్థానాలు ఈజీగా వస్తాయట. మరో పాతిక స్థానాల్లో కాంగ్రెస్ కు గట్టి పోటీ ఎదురు కాబోతోందనీ, ఇంకో పదిహేడు స్థానాల్లో కూడా గట్టిగా ప్రయత్నిస్తే కాంగ్రెస్ గట్టెక్కే అవకాశం ఉందని రాహుల్ సర్వేలో తేలిందట. అంతేకాదు, ఓ మూడు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవర్ని బరిలోకి దించినా గెలుపు నల్లేరు మీద నడక అని చెబుతున్నారు.
రాహుల్ సర్వేలో రెండో స్థానం తెరాసకు ఇచ్చారు. ఆ పార్టీకి ఓ 28 స్థానాలు దక్కుతాయనీ, కాస్త ప్రయత్నిస్తే మరో 16 స్థానాల్లో కూడా పట్టు సాధించే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక, తెలుగుదేశం పార్టీకి మహా అయితే ఐదు సీట్లు వచ్చే అవకాశం ఉందని తాజాగా కాంగ్రెస్ సర్వే తేల్చింది. ఏదేమైనా, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన కనీస సంఖ్యా బలాన్ని కాంగ్రెస్ సునాయాసంగా చేరుకుంటుందనేది ఈ సర్వే అంతిమ ఫలితం. మరి, ఈ సర్వేపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందన ఎలా ఉంటుందో, ఆయన త్వరలో తెరమీదికి ఎలాంటి సర్వే తెస్తారనేది మరోసారి ఆసక్తికరంగా మారింది. మొత్తానికి, ఈ సర్వేలు ఏ ప్రాతిపదికన చేసినా, ఎంత శాస్త్రీయంగా నిర్వహించినా ప్రజలు నమ్మే పరిస్థితి లేకుండా పోయింది! ఎందుకంటే, రాజకీయ పార్టీలు చెప్పుకునే సర్వేలు వారికి అనుకూలంగానే తయారు చేసుకుంటారు అనే ఒక స్థిరమైన అభిప్రాయం సామాన్య ప్రజల్లో ఏర్పడింది. ఇలాంటి సర్వేలన్నీ కేవలం ఆయా పార్టీల కేడర్ లో ఉత్సాహం నింపడానికి కొంతమేర ఉపయోగపడతాయేమో తప్ప, వాస్తవ ప్రజాభిప్రాయానికి అద్దం పడుతున్నాయని ఎవ్వరూ నమ్మరు!