హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎనిమిదిరోజులుగా చైనా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన ఇవాళ హాంకాంగ్‌లో పర్యటిస్తున్నారు. రెనెసెన్స్ హార్టర్ వ్యూ హోటల్లో పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను అక్కడి పారిశ్రామికవేత్తలకు వివరిస్తున్నారు.
మరోవైపు కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కవిత ఇవాళ విదేశీ పర్యటనకు బయలుదేరారు. ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ వెంట కాంబోడియా, లావోస్ వెళ్ళే ప్రతినిధిబృందంలో ఉన్న ఐదుగురు ఎంపీలలో కవితకూడా ఒకరు. వీరు ఐదురోజులపాటు ఆయా దేశాలలో పర్యటిస్తారు. కాంబోడియా, లావోస్ దేశాలతో ఆర్థిక, సాంస్కృతిక సంబంధాల బలోపేతమే పర్యటన ముఖ్యోద్దేశమని కవిత ఢిల్లీలో మీడియాతో చెప్పారు. తెలంగాణ రాష్ట్రంనుంచి ప్రతినిధిగా ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ తనను ఎంపిక చేశారని, ఈ అవకాశాన్ని అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. లోక్‌సభకు తొలిసారిగా ఎన్నికైన కవిత రెండునెలల క్రితం లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ నేతృత్వంలో బెల్జియం, నార్వే తదితర దేశాలలో పర్యటించారు. కేసీఆర్ కుమారుడు, తెలంగాణ మంత్రి కేటీఆర్ గత మే నెలలో అమెరికాలో పర్యటించిన సంగతి తెలిసిందే. మొత్తానికి మొన్న సీపీఎమ్ నాయకురాలు బృందా కరత్ వ్యాఖ్యానించినట్లు – ఫ్యామిలీకి ఫ్యామిలీ మొత్తం బాగానే జల్సా చేస్తున్నారు పదవులలో. కాకపోతే పాపం హరీష్ రావుమాత్రం చెరువులు పట్టుకుని తిరుగుతున్నాడు. ఆయన లక్ష్యం విదేశీపర్యటనలలాంటి చిన్నవి కాకుండా పెద్దదయి ఉంటుందేమో!