తెలంగాణలో ఇప్పుడు నల్గొండ ఉప ఎన్నిక చర్చ మాంచి జోరు మీద ఉంది. ఈ ఎన్నిక ద్వారా తమ సత్తా ఏంటో మరోసారి చాటుకునే అవకాశం ఉంటుందనీ, ఇదే సమయంలో లుకలుకలతో నలిగిపోతున్న కాంగ్రెస్ పార్టీపై రాజకీయంగా పైచేయి సాధించినట్టుగా ఉంటుందనేది సీఎం కేసీఆర్ వ్యూహం. అందుకే, నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డితో రాజీనామా చేయించి, వెంటనే ఉప ఎన్నికకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్టు ఈ మధ్య కథనాలు వస్తున్నాయి. ఆ విజయంతో పార్టీ శ్రేణులకు కొత్త ఊపు ఇద్దామని అనుకుంటున్నారు. ఇదే ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ పార్టీ కూడా సిద్ధమైపోతోంది. నిజానికి, గతంలో గుత్తా కాంగ్రెస్ నుంచి గెలిచారు కాబట్టి, ఆ స్థానాన్ని మరోసారి నిలబెట్టుకోవడం ద్వారా తమ సత్తా చాటుకోవచ్చని కాంగ్రెస్ చూస్తోంది. ఇక, తెలుగుదేశం అయితే.. నల్గొండ ఎన్నిక బరిలోకి రేవంత్ రెడ్డిని దింపాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. నల్గొండ పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజక వర్గాల్లో రేవంత్ రెడ్డికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయనీ, రేవంత్ ని బరిలోకి దించితే తెరాసకు సమర్థంగా ఎదుర్కొని, రాష్ట్రంలో పార్టీ ఉనికిని నిలుపుకోవచ్చు అనేది టీడీపీ వ్యూహంగా కనిపిస్తోంది.
మొత్తానికి, నల్గొండ ఉప ఎన్నిక చుట్టూ ఇలా ఎవరి అంచనాల్లో వారు తలమునకలై ఉన్నారు. అయితే, వాస్తవంగా ఆలోచిస్తే.. గుత్తా సుఖేందర్ రెడ్డి ఇప్పటికిప్పుడు రాజీనామా చేసినా సాంకేతికంగా ఎన్నికలు వచ్చే పరిస్థితులు ఉన్నాయా అనేదే చర్చనీయాంశం. నిజానికి, మంత్రి పదవి కోసమే గుత్తా తెరాసలోకి వెళ్లారని అంటారు. కానీ, ఆయనకి ఇంతవరకూ సరైన పదవి దక్కలేదు. ఇన్నాళ్లకు ఒక క్యాబినెట్ ర్యాంకు హోదా ఉన్న పదవిని కేసీఆర్ ఇవ్వబోతున్నారు. అయితే, తెరాసలో చేరినట్టు గుత్తా గతంలో ప్రకటించినా, గులాబీ కండువా కప్పుకోకుండా, కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిచిన పదవిని వదులుకోకుండా నెట్టుకొస్తూ ఉన్నారు. ఇప్పుడు గుత్తా రాజీనామా చేసినా వెంటనే ఉప ఎన్నిక వచ్చే పరిస్థితులు తక్కువగా ఉన్నాయనే వాదన తెరమీదికి వచ్చింది.
ఇప్పటికిప్పుడు గుత్తా రాజీనామా చేస్తే.. ఆరు నెలల్లోపు ఉప ఎన్నికలు నిర్వహించే అవకాశం ఎన్నికల కమిషన్ కు ఉంటుంది. అంటే, వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకూ ఉప ఎన్నిక ఉండకపోవచ్చు. ఒకవేళ ఆ తరువాత ఎన్నికకు వెళ్దామన్నా.. అక్కడ మరో సమస్య ఉంది. వచ్చే ఏడాది ద్వితీయార్థంలోనే సార్వత్రిక ఎన్నికలు ఉండే అవకాశాలున్నాయి. కొన్ని రాష్ట్రాల శాసన సభల ఎన్నికలతోపాటు, లోక్ సభ ఎన్నికల్ని కూడా కలిపి నిర్వహించాలని కేంద్రం భావిస్తున్న సంగతి తెలిసిందే. దీని కోసం అవసరమైన రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి, ముందు వెనకలు పరిగణనలోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అలాంటప్పుడు, ఒక్క నల్గొండ ఎంపీ స్థానానికి హుటాహుటిన ఎన్నిక నిర్వహించాల్సిన అవసరం ఏముంటుంది..? ఇంకొన్నాళ్లు ఆగితే ఏకంగా అన్నింటితో కలిపి ఎన్నికలకు వెళ్లొచ్చనే ఉద్దేశంతో వాయిదా వేసినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.
ఇదే జరిగితే కేసీఆర్ ఆశించిన ప్రయోజనం నెరవేరదు కదా. వచ్చే ఎన్నికల్లోపు తమ బల ప్రదర్శన కోసమే ఈ ఉప ఎన్నిక అని అంటున్నారు కదా! ఆ మాటకొస్తే.. ఇతర పార్టీలకు కూడా ఇప్పుడే ఉప ఎన్నిక జరగకపోతే పెద్దగా ప్రయోజనం ఉండదు. నల్గొండ ఎన్నిక ఫలితం ద్వారా ఎవరి మైలేజీ కోసం వారు చూస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో నల్గొండ ఉప ఎన్నిక నిర్వహణపై మున్ముందు ఎలాంటి మార్పులు ఉంటాయో అనేది ఆసక్తికరంగా మారుతోంది.