తెలుగుదేశం పార్టీకి నంద్యాల ఉప ఎన్నిక ఇచ్చిన ఉత్సాహమే తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు నల్గొండలో ఎన్నిక పెట్టించి చూద్దామనే ఆలోచన నిచ్చిందట. గతసారి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ హేమాహేమీలు చాలామంది గెలిచారు. వారిలో ఒకరైన సుఖేందర్ రెడ్డి రాజీనామా చేసి టిఆర్ఎస్లో చేరినప్పుడే రాజీనామా చేయడానికి సిద్ధమైనారు. ఆయన లక్ష్యం మంత్రి పదవి గనక శాసనసభకు లేదా మండలికి వెళ్లాలనుకున్నారు. అయితే తుది నిర్ణయం ముఖ్యమంత్రిదేనని అప్పట్లో ఆయన నాతోనే అన్నారు. ఆ సమయంలో సామూహిక పార్టీ మార్పుల నేపథ్యంలో ఒకరితో రాజీనామా చేయిస్తే మిగతా వారికీ వర్తింపచేయాల్సి వస్తుంది గనక కెసిఆర్ అందుకు అనుమతించలేదు. అనేక ఉప ఎన్నికలు స్థానిక ఎన్నికలు గెలిచినా ఈ సంకోచమే అడ్డుపడుతూ వచ్చింది. అయతే భూమా నాగిరెడ్డి మరణం కారణంగా నంద్యాలలో అనుకోని ఉప ఎన్నిక రావడం, ఎపి రాజకీయ వాతావరణపై దాని ప్రభావం చూశాక తము కూడా నల్గొండలో మరో విధంగా రాజకీయ ప్రయోగం చేయాలని టిఆర్ఎస్ ఆలోచించింది. సుఖేందర్‌రెడ్డికి ఎంపి పదవి గొప్ప కాదు. రాష్ట్ర రైతు సమితుల సమన్వయకర్తగా ఆయనను నియమించనున్నారు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు నిర్వహించిన కర్షకపరిషత్ వంటి పదవి గనక ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. ఆయన ఆ పదవిలోకి వెళ్లాక రాజీనామా చేస్తే గతసారి టిఆర్ఎస్ అభ్యర్థిగా ఆయనతో తలపడిన సన్నిహితుడు పల్లా రాజేశ్వరరెడ్డిని అక్కడ మళ్లీ పోటీ చేయించవచ్చు. ఎన్నికలకు పెద్ద వ్యవధి లేదు గనక ఆయన ఎక్కువ రోజులు పదవిలోవుండకపోవచ్చు గాని తద్వారా వచ్చే సాధారణ ఎన్నికల నాటికి ఆయన స్థిరపడే అవకాశం వుంటుందన్నది వ్యూహం. ఎప్పుడూ కెసిఆర్‌ను అంటిపెట్టుకుని వుండే విశ్వాసపాత్రుడైన పల్లాకు తగు పదవి ఇంకా రాలేదనే భావం వుంది. మరోవైపున టిడిపి తరపున తాను పోటీ చేస్తానని రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. గతంలోనూ తలసాని శ్రీనివాసయాదవ్ రాజీనామా చేస్తే ఆ స్థానంలో నిలబడతానని చెప్పి వున్నారు గాని జరగలేదు. కాంగ్రెస్ కూడా ఎలాగైనా నల్గొండలో సత్తా చూపిస్తే వచ్చే ఎన్నికలలో అధికారానికి మార్గం సుగమమవుతుందని ఆశపడుతున్నది. ఇదంతా జరగాలంటే ముందు రాజీనామా చేయాలి, ఎన్నికలు రావాలి.మొదట అనుకున్న ప్రకారమైతే 14వ తేదీనే రాజీనామా చేసి వుండాలి.మరి పంపారో లేదో స్పీకర్ కార్యాలయమే చెప్పాలి.