తెలుగు360.కామ్ రేటింగ్ : 1/5
కొంతమంది దర్శకులు ‘లైన్లు’ పట్టుకొని లైన్లో నిలబడతారు.. సినిమాలు తీసేద్దామని.
‘లైన్’గా వినడానికి బాగున్నవన్నీ సినిమాలుగా పనిచేయవ్… అని చెప్పేవాళ్లు లేక, ఏదోటి దొరికింది కదా, అదే సినిమా అవ్వకపోతుందా అనుకొనేవాళ్లు ఎక్కువైపోయి… అలాంటి లైన్లే.. సినిమాలుగా మార్చేస్తుంటారు. చివరికి థియేటర్ల దగ్గర టికెట్ కౌంటర్ల ముందు ఇలాంటి ‘లైన్లు’ కనిపించకుండా మాయమైపోతుంటాయి.
‘కథలో రాజకుమారి’ కూడా రెండు ముక్కల్లో వినడానికి బ్రహ్మాండంగా ఉండొచ్చు గాక. కానీ.. దాన్ని రెండు గంటల సినిమాగా మలచడంలో టీమ్ మొత్తం ఏకతాటిపై, ఓకే మాటపై నిలబడి మరీ విఫలమైంది. ఆ కథా.. కమా.. మిషూ.. ఎట్టిదనిన..
* కథ
అర్జున్ (నారా రోహిత్) ఓ సినిమా విలన్. యాభై సినిమాల్లో ఐదు ఫిల్మ్ ఫేర్ అవార్డులు, బోల్డంత డబ్బు, స్టార్ డమ్. దాంతో నిజ జీవితంలోనూ విలన్ గా ప్రవర్తిస్తుంటాడు. పొగరు, గర్వం, బలుపు…. ఇవన్నీ సమపాళ్లలో మేళవించిన తత్వం అర్జున్ ది. ఓ కారు ప్రమాదంలో తన కోసం తన డ్రైవరు (సూర్య) కాలు పోగొట్టుకొంటాడు. అక్కడి నుంచీ అర్జున్‌లో మానవత్వం మేల్కొంటుంది. ఎంతగా అంటే – కనీసం తెరపై ఎవర్నైనా కొట్టడానికి ఆలోచిస్తుంటాడు. చెడ్డవాడిగా నటించడానికి చేతులు రాక.. నిస్తేజంగా ఉండిపోతాడు. ఇలాగైతే నటుడెలా అవుతాడు.?? తన వల్ల సినిమాలు ఆగిపోతాయి. తనలో విలనిజం ఎక్కడికెళ్లిపోయిందో తెలీక, దాన్ని వెదికే ప్రయాణంలో… బాల్య స్నేహితులురాలు (నమిత ప్రమోద్) దగ్గరకు వెళ్తాడు. అక్కడేం జరిగిందన్నదే కథ.
* విశ్లేషణ
నిజంగా ఇలాంటి ఫ్లాట్ తెలుగు సినిమాలలో కనిపించడం కష్టం. ఏ మలయాళీ, బెంగాలీ చిత్రాల్లోనో ఆర్ట్ సినిమా కథలకు పనికొచ్చే ముడిసరుకులాంటి కథ ఇది. దీన్ని ఆర్ట్ సినిమాలా తీసినా బ్రహ్మాండంగా ఉండేది.. అవార్డులూ వచ్చేవి. కానీ.. దీన్ని కమర్షియల్ మీటర్లో, ఓ లవ్ స్టోరీ మిక్స్ చేసి, రివైంజ్ డ్రామా కలరిచ్చి తీయడానికి ప్రయత్నించారు. దాంతో కథలో ఉన్నసారం ఎక్కడికో కొట్టుకెళ్లిపోయి నిస్సారంగా తయారైంది.
సినిమా ప్రారంభం, సినిమా ఎపిసోడ్లు, అర్జున్ మంచివాడిగా మారిపోవడం… ఇంత వరకూ కథ బాగానే వెళ్తున్నట్టుంటుంది. తన చిననాటి స్నేహితురాలు సీతని వెదుక్కొంటూ ఊరెళ్లడం దగ్గర్నుంచీ కథ రోడ్డెక్కింది. ఆ ఆడపిల్లమీద రివైంజ్ తీర్చుకోవడం అనే పాయింట్.. అసలేమాత్రం రుచించదు. అమ్మాయిని ఏడిపించి, తద్వారా పైచాచిక ఆనందం పొందితే, అప్పుడు తనలోని నెగిటీవ్ క్యారెక్టర్ బయటకు వస్తుందనుకోవడం ఏమిటో అర్థం కాదు. అసలు కథ అక్కడే పట్టు తప్పేసింది. అర్జున్ మంచి వాడిగా మారాడు. అలా మారితే.. సినిమాల్లో చెడ్డవాడిగా నటించకూడదా?? నటించలేడా..? అసలు ఆ పాయింటే ఏమాత్రం బలం లేనిది. దాన్ని పట్టుకొని రెండు గంటల కథ నడపడం ఏమిటి?? ద్వితీయార్థం ఎంతకీ అవ్వదు. సెకండాఫ్ గంటలో అయిపోతుంది. అయినా… ఏదో భారం. కథలో వినోదానికి చోటు లేదు. కథలో రాజకుమారిలా కనిపించాల్సిన అమ్మాయి… జూనియర్ ఆర్టిస్టుకంటే దారుణంగా కనిపిస్తే.. టైటిల్ కైనా న్యాయం జరిగేదెలా?? చివరికి అర్జున్ ఇంకా మంచివాడిగా మారతాడని ఊహించని ప్రేక్షకుడు ఉంటే.. వాడికి అసలు సిసలు ఆస్కార్ ఆవ్వాలి. అర్జున్‌ని ఓ స్టార్ గా పరిచయం చేశారు. అలాంటి స్టార్ ఊర్లోకి వస్తే.. వాడెవడో తెలీదన్నట్టే ఉంటారు జనం. అర్జున్ మంచివాడిగా మారిపోవడానికి కారణం కన్వెన్సింగ్గా అనిపించదు. చిన్నప్పటి ఎపిసోడ్లూ అంతే. ఊర్లోంచి అర్జున్ కుటుంబం వెళ్లిపోవడానికీ, సీతపై వైరం పెంచుకోవడానికీ బలమైన కారణాలు కనిపించవు. దాంతో.. కథతో కనెక్ట్ అవ్వలేడు ప్రేక్షకుడు.
* నటీనటులు
రోహిత్ విలన్ పాత్ర వరకూ బాగా సూటయ్యాడు. కొత్తగానూ అనిపించాడు. అయితే.. సీత చుట్టూ సాగిన డ్రామాలో తన నటన కూడా సాధారణమైపోయింది. కాకపోతే ఒకటి.. హీరోటిక్ కథల్ని ఎంచుకోకుండా, ఇలాంటి సినిమాలవైపు, కథల వైపు అడుగులేయడం అభినందించదగిన విషయం. నాగశౌర్య కేవలం ఫ్రెండ్లీగా చేసిన సినిమా ఇది. అతన్ని ఓ క్యారెక్టర్ అనుకోవాలంతే. హీరోయిన్ గా నమిత ప్రమోద్ ఏమాత్రం సూటవ్వలేదు. రాజకుమారి అనే టైటిల్ ఏంటి?? ఆ ఫేసేంటి?? అనిపిస్తే అది ప్రేక్షకుడి తప్పు కాదు. ప్రభాస్ శీను, అజయ్.. నవ్వించడానికి కేవలం ప్రయత్నించారంతే!
* సాంకేతికంగా..
కొన్ని మాటలు అక్కడక్కడ మెరుస్తాయి. ‘మన్నుకి ఇవ్వని గౌరవం ఆ మిన్ను కూడా తీసుకోదు’ అనే మాట టచింగ్‌గా ఉంది. ‘పారేసుకొని వెదకడం లేదు.. పోగొట్టుకొని వెదుకుతున్నా. పారేసుకోవడంలో నిర్లక్ష్యం ఉంటుంది.. పోగొట్టుకోవడంలో కాస్తో కూస్తో నిజాయతీ ఉంటుంది’ అనే డైలాగ్ కూడా బాగుంది. ఇలాంటి లైన్లు షార్ట్ ఫిల్మ్‌కి పనికొస్తాయేమో,. సినిమాగా మలచాలంటే ఇంకాస్త దమ్ము అవసరం. పాటలు, ఫొటోగ్రపీ, సాంకేతిక విలువలు ఇవన్నీ అంతంత మాత్రంగానే.
* ఫైనల్ టచ్: కథ… ‘లో’. రాజకుమారి.. ‘మిస్సింగ్!!’
తెలుగు360.కామ్ రేటింగ్ : 1/5