రేవంత్రెడ్డి వ్యక్తిగత శైలిపైన, రాజకీయ పోకడల పైన టిటిడిపి నేతలు చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విభజన తర్వాత పార్టీ ఇంతటి విషాదయోగంలో పడిపోవడానికి ఆయనే కారణమని ఆరోపిస్తున్నారు. టిడిపి అద్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎపి ముఖ్యమంత్రి హౌదాలో ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాదులో వుండివుంటే పరిస్థితి ఇంతగా దిగజారేదా అని ఒక నాయకుడు కోపంగా ప్రశ్నించారు. చంద్రబాబు తుండూ తుపాకి ఎత్తుకుని పరుగులు తీయడానికి కారణమైనంది రేవంత్ దుస్సాహసం కాదా అని వారి ప్రశ్న. ఆయన చేతుల్లో అనేక రహస్యాలు మాత్రమే గాక తన రాజకీయ భవిష్యత్తు కూడా వున్నందున చంద్రబాబు నాయుడు ఏమీ అనలేరని రేవంత్ రెచ్చిపోతున్నారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్తో కలసి పనిచేయడం మన మూల సిద్ధాంతానికే వ్యతిరేకం అని చంద్రబాబు చెప్పిన తర్వాత కూడా రేవంత్ వారితో కలిసే వ్యవహరిస్తున్నారనీ, వున్న శక్తికి మించిన విమర్శలతో వివాదాలు పెంచుతున్నారని టిడిపిసీనియర్లు కోప్పడుతున్నారు.
అయితే ఆయనపై ఎలాటి ఫిర్యాదులు అధినేత తీసుకోవడం లేదు. తీసుకోలేరు కూడా. కాని రేవంత్ అప్పుడప్పుడు రెడ్లంతా కలసి పోవాలన్నట్టు కాంగ్రెస్తో కలసి మాట్లాడ్డం మింగుడు పడటం లేదని వారంటున్నారు. వ్యక్తిగతంగా రేవంత్ స్వంత ఎజెండా వుంటే వుండొచ్చు. కాని టిడిపి కాంగ్రెస్ కలసి పోటీ చేస్తే పక్కన ఏపిలోఏం చెప్పుకుంటాం? అని వాపోతున్నారు. స్వభావ రీత్యా రేవంత్ అనుకున్న ప్రకారమే చేస్తారు గాని మార్పు వుండదు. అయితే దీనిపైచంద్రబాబే ఏదో ఒక దశలో హెచ్చరిక చేస్తారన్న ఆశాభావంతో చూస్తున్నాం. కాని పాపం ఆయన బాధలు ఆయనకున్నాయి అంటూ పరోక్షంగా ఓటుకు నోటు కేసును ప్రస్తావిస్తున్నారు. అదీ సంగతి.