హైదరాబాద్: బాలీవుడ్ నంబర్ వన్ హీరోయిన్ ఎవరంటే దీపిక, ప్రియాంక, కత్రిన, కరీనా కపూర్లలో ఎవరో ఒకరు అయి ఉంటారని అందరూ అనుకుంటారు. కానీ వీరెవరూ కాదని, కంగనా రనౌత్ అని తాజా గణాంకాలతో తేలింది. తన తదుపరి చిత్రానికి కంగన తీసుకుంటున్న పారితోషికం అక్షరాలా రు.11 కోట్లు. ఒక్కో చిత్రానికి దీపిక రు.8-9 కోట్లు, ప్రియాంక చోప్రా రు.7-8 కోట్లు, కత్రినా కైఫ్ రు.6-7 కోట్లు, కరీనా రు.8-9 కోట్లు తీసుకుంటుండగా రు.11 కోట్లు తీసుకోవటంద్వారా కంగనా వీరందరినీ క్రాస్ చేసేశారు.
బాలీవుడ్ నంబర్స్ రేసులో ఎక్కడో వెనక ఉన్న కంగన డార్క్ హార్స్లాగా ఒక్కసారిగా అగ్రస్థానానికి చేరటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కథల ఎంపికలో ఆమె ధైర్యమైన నిర్ణయాలు, పాత్రపోషణలో ఆమె తీసుకునే శ్రద్ధే దీనికి కారణాలని బాలీవుడ్ విశ్లేషకులు చెబుతున్నారు. దశాబ్దకాలంక్రితం అనురాగ్ బసు దర్శకత్వంలో వచ్చిన ‘గ్యాంగ్స్టర్’ చిత్రంతో రంగప్రవేశం చేసిన కంగన ‘తను వెడ్స్ మను’, ‘క్రిష్’, ‘షూట్ ఔట్ ఎట్ వడాలా’, ‘డబుల్ ధమాల్’, ‘క్వీన్ 3’, ‘తను వెడ్స్ మను రిటర్న్స్’ వంటి హిట్ చిత్రాలతో అగ్రస్థానానికి చేరుకున్నారు. రెండుసార్లు ఉత్తమనటిగా జాతీయ అవార్డ్ కూడా గెలుచుకున్నారు. రాబోతున్న చిత్రాలు ‘రంగూన్’, ‘సిమ్రన్’, ‘రాణి లక్ష్మీబాయ్’లలోకూడా కంగనా మంచి పాత్రలు పోషిస్తోంది. తెలుగులో ఆమె ప్రభాస్ పక్కన ఏక్ నిరంజన్ అనే చిత్రంలో నటించినప్పటికీ ఆమెను ఎవరూ పట్టించుకోకపోవటం గమనార్హం.