ప్రపంచ బ్యాంక్ వ్యాపారానికి అనువయిన రాష్ట్రాలలో ఏపీకి దేశంలో 2వ స్థానం, తెలంగాణాకి 13వ స్థానం కేటాయించడం పట్ల రెండు రాష్ట్రాలలో ప్రజలు, ప్రభుత్వాలు, పార్టీలు అందుకు అనుగుణంగానే స్పందిస్తున్నాయి. తెలంగాణాకి 13వ స్థానం కేటాయించడం పట్ల ఆ రాష్ట్ర నేతలు అసంతృప్తి వెలిబుచ్చడం సహజమే. కానీ ఏపీకి రెండవ స్థానం కేటాయించడం పట్ల ఏపీకి చెందిన కాంగ్రెస్, వైకాపాలు స్పందించకపోవడం గమనిస్తే ఆ రెండు పార్టీలు దీనిని కూడా హర్షించలేకపోతున్నాయని స్పష్టం అవుతోంది.
ప్రపంచ బ్యాంక్ ఏపీకి ఇచ్చిన ర్యాకింగ్ వలన రాష్ట్రానికి ఎంతో కొంత మేలే జరుగుతుంది తప్ప కీడు జరుగదు. రాష్ట్ర విభజన తరువాత చాలా క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్న సమయంలో కూడా ఆంద్రప్రదేశ్ రాష్ట్రం వ్యాపారానికి చాలా సానుకూలమయినదని ప్రపంచ బ్యాంక్ గుర్తించి ప్రకటించింది. కానీ ఏపీకే చెందిన కాంగ్రెస్, వైకాపాలు రాష్ట్రాభివృద్ధికి ఏ మాత్రం సహకరించనప్పటికీ కనీసం ప్రపంచ బ్యాంక్ ప్రకటించిన తరువాతయినా మనస్పూర్తిగా స్వాగతించి ఉండి ఉంటే అందరూ హర్షించేవారు.కానీ ఆ విధంగా చేసినట్లయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమర్ధతని అంగీకరించినట్లవుతుందనే భయంతోనే బహుశః ప్రపంచ బ్యాంక్ ప్రకటనను హర్షించలేక పోయారని భావించాల్సి ఉంటుంది. అదే ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ మీడియాలో ఏదయినా చిన్న వార్త వచ్చినట్లయితే దానిని పట్టుకొని ప్రతిపక్షాలు చాలా రాద్దాంతం చేస్తుంటాయి.