తెలంగాణ కాంగ్రెస్ లో గ్రూపుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు! ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఆ బాధ్యతల నుంచి తప్పించాలంటూ ఢిల్లీ స్థాయిలో కొంతమంది కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రయత్నాలు తెలిసినవే! పార్టీ పగ్గాలు అప్పగిస్తే తమ సత్తా ఏంటనేది నిరూపించుకుంటాం అని కోమటిరెడ్డి సోదరులు బహిరంగంగానే అభిప్రాయపడుతున్న సంగతి తెలిసిందే. అంతేకాదు, ఇదే క్రమంలో ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ మీద విమర్శలు చేయడం, ఆయన నిర్ణయాలకు మూతి విరవడం అనేది కోమటిరెడ్డి సోదరులు ఎప్పట్నుంచో చేస్తున్న పనే. ఉత్తమ్ ను గంగిరెద్దు అని ఎద్దేవా చేస్తున్న సందర్భాలూ ఉన్నాయి. త్వరలోనే నల్గొండ ఉప ఎన్నిక జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ ఎన్నిక ద్వారా ఉత్తమ్ వైఫల్యం కోసం ఈ సోదరులు ఎదురుచూస్తున్నట్టుగా ఉన్నారనే విమర్శ వినిపిస్తోంది. ఆ విమర్శ చేస్తున్నది కూడా ఎవరో కాదు.. ఉత్తమ్ వర్గీయులే కావడం విశేషం.
నిజానికి, ఎప్పటికప్పుడు ఉత్తమ్ ను తప్పుబడుతూ ఉండటం, విమర్శిస్తూ ఉండటం అనేది సొంత పార్టీ పరువును తీసుకుంటున్నట్టే కదా! దీంతో ఉత్తమ్ వ్యాఖ్యలకు పార్టీ వర్గాల్లోనే విలువ లేకుండా చేయడమే ఈ సోదరుల లక్ష్యంగా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. పైగా, త్వరలో జరగబోతున్న నల్గొండ పార్లమెంటు నియోజక వర్గం ఉప ఎన్నికల్లో ఈ ఇద్దరు సోదరుల పనితీరుపై తమకు నమ్మకం లేదనే వాదన ఉత్తమ్ వర్గం నుంచి వినిపిస్తోంది. కోమటిరెడ్డి సోదరులిద్దరూ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అనుకూలంగా ప్రవర్తిస్తున్నారనీ, కాంగ్రెస్ పార్టీలో ఉంటూ తెరాసకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉత్తమ్ వర్గం నుంచీ వినిపిస్తూ ఉండటం విశేషం. కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతున్న ఈ తరుణంలో, సొంత పార్టీలోనే ఉంటూ పార్టీ ప్రయోజనాలకు గండికొట్టే విధంగా ఈ సోదరుల వ్యవహారం ఉంటోందనే ఆవేదన వ్యక్తమౌతోంది.
ఒకవేళ పార్టీకి నిజంగా మేలు చేయడమే ఈ సోదరుల ఉద్దేశం అయినప్పుడు ఢిల్లీ వెళ్లి అధినేత్రి సోనియాతోగానీ, రాహుల్ గాంధీతోగానీ మాట్లాడి, తమ వ్యూహాలను వివరించొచ్చు కదా అనే వాదన వినిపిస్తోంది. ఉత్తమ్ నేతృత్వంలో కాంగ్రెస్ కు భవిష్యత్తు ఉండదనే విషయాన్ని వివరించే స్వేచ్ఛ వారికి ఉంది కదా అనేవారూ లేకపోలేదు. కేసీఆర్ అజెండాను రహస్యంగా ఈ సోదరులు నెత్తికెత్తుకున్నారనీ, పార్టీలో ఉంటూ ప్రజల్లో ప్రతిష్టను దిగజార్చడమే వారి లక్ష్యంగా కనిపిస్తోందని ఉత్తమ్ వర్గం ఆరోపిస్తోంది. నిజానికి, ఈ సోదరులు పార్టీ మారే అవకాశాలున్నట్టుగా ఈ మధ్య కొన్ని కథనాలు వచ్చాయి. అయితే, అలాంటిదేదీ లేదని ఇటీవలే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొట్టిపారేశారు. తాము కాంగ్రెస్ లోనే కొనసాగుతామని స్పష్టం చేశారు. అయితే, నల్గొండ ఉప ఎన్నిక రాబోతున్న నేపథ్యంలో ఈ సోదరుల వ్యవహార శైలిపై ఉత్తమ్ వర్గం ఆందోళన చెందుతోంది.
ఈ ఉప ఎన్నికను ఉత్తమ్ ను రాజకీయంగా దెబ్బతీసే అవకాశంగా మార్చుకునేందుకు ఈ సోదరులు ప్రయత్నిస్తున్నారంటూ ఢిల్లీకి ఫిర్యాదు చేసే అవకాశం ఉందని టి. కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. మొత్తానికి, కోమటిరెడ్డి సోదరుల వ్యవహార శైలి మరోసారి చర్చనీయాంశంగా మారుతున్నట్టుగానే కనిపిస్తోంది. అయితే, ఉత్తమ్ ను నిజంగానే దెబ్బతీయడమే ఈ సోదరుల అజెండానా..? లేదంటే, కోమటిరెడ్డి తలనొప్పిని వదిలించుకోవడం కోసం ఉత్తమ్ వర్గమే కావాలని ఇలాంటి ఆరోపణలు ప్రచారంలోకి తెస్తోందా అనే కోణం కూడా ఉంటుంది కదా. ఏదేమైనా, కాంగ్రెస్ లో ఈ కుమ్ములాటలకే సమయం సరిపోతున్నట్టుగా కనిపిస్తోంది.