బయోపిక్ లు తీయడం లో సిద్దహస్తుడైన సంచలనాల దర్శకుడు రాం గోపాల్ వర్మ మరో సంచలనానికి తెరలేపారు. తాను తీయనున్న ఎన్ టీయార్ బయోపిక్ ని లక్ష్మీ పార్వతి కోణం లో తీస్తానని, ఈ సినిమా కి టైటిల్ కూడా Lakshmi’s NTR అని పెడతానని ఫేస్ బుక్ లో పోస్ట్ చేసాడు. ఇక వెన్నుపోటు తో సహా అన్ని అంశాలూ ఈ సినిమాలో ఉంటాయని ప్రకటించాడు ఆర్జీవి.
గతం లో బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ తీస్తానని ప్రకటించినపుడు, ఆర్జీవి ఆ సినిమా ని తాను డైరెక్ట్ చేస్తానని ఫీలర్లు పంపారు. అడవి రాముడు సినిమా చూడటానికి 23 సార్లు 10 కి.మీ. పైగా నడిచివెళ్ళిన తాను, ఎన్ టీయార్ మొదటి మహానాడు కి అటెండయిన లక్షలాదిమందిలో ఒకడినైన తాను ఈ సినిమా తీయడానికి అర్హుడినని ప్రకటిస్తూ ఒక వీడియో కూడా రిలీజయింది. కానీ బాలకృష్ణ ఇప్పటి వరకూ దర్శకుడి పేరు ని ప్రకటించలేదు. పూరీ జగన్నాధ్ పేరు, ప్రస్థానం దర్శకుడు, ఎన్ టీయార్ బయోపిక్ కి స్క్రిప్ట్ సహకారమందించిన దేవ కట్టా పేరు ప్రచారం లోకి వచ్చినా ఇంకా దర్శకుడెవరనే సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే ఆర్జీవి కి బాలకృష్ణ అవకాశమివ్వకపోవడం వల్లే, ఇలా లక్ష్మీ పార్వతి కోణం లో సినిమా తీస్తున్నాడా అనే సందేహాలొస్తున్నాయి.
ఏది ఏమైనా ఎన్ టీయార్ బయోపిక్ వార్తలు వచ్చినపుడే బాలకృష్ణ ఈ సినిమా ని తీయకూడదని కొందరు అభిమానులు అభిప్రాయపడ్డారు. ఎందుకంటే వైస్రాయ్ ఎపిసొడ్ వల్ల ఆరిపోయిన నిప్పుని రాజేసినట్టవుతుంది కాబట్టి. అయితే ఇంతలోనే ఎన్ టీయార్ బయోపిక్ కేవలం ఆయన 1983 లో ముఖ్యమంత్రి అయ్యేవరకు సన్నివేశాలతోనే తీస్తారనే వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఆర్జీవి లాంటి వాళ్ళు “పొటీ ఎన్ టీయార్ బయోపిక్” ని ప్రకటించారు. లక్ష్మీ పార్వతి మాత్రం ఇప్పటివరకు వర్మ తనని సంప్రదించలేదని, ఒకవేళ సంప్రదించి, స్క్రిప్ట్ నచ్చితే, తాను ఈ సినిమాని స్వాగతిస్తానని ప్రకటించారు.
చూడాలి ఈ పోటాపోటీ ఎన్ టీయార్ బయోపిక్ లు ఎక్కడికి దారితీస్తాయో!!!