చెన్పైలో అమరావతి సదావర్తి భూములు 60 కోట్లకు పాడుకోవడం రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద గుణపాఠమే. ఆ మహానగరంలో 83.11 ఎకరాల భూమిని 22.4 కోట్లకు లోపాయికారిగా కట్టబెట్టిన ప్రభుత్వం కన్నంలో దొరికిపోయింది. ఈ విషయం వైసీపీ ఎంఎల్ఎ ఆళ్ల రామకృష్ణారెడ్డి కోర్టులో సవాలు చేస్తే దేవాదాయ శాఖ ఏవో పొంతనలేని సాకులు చెప్పింది. ఆ భూములు ఎక్కడున్నాయో తెలియదు గనకే మరింతగా నష్టం జరక్కుండా వేలం వేసి అప్పగించినట్టు సమర్థించుకుంది. అయితే ఆ భూములు లక్షణంగా కనిపిస్తున్నాయనీ, వాటికి వేలం మూడో కంటికి తెలియకుండా పూర్తి చేసి అస్మదీయులకు కట్టబెట్టారని ప్రతిపక్షాలూ విమర్శించాయి. ఈ విషయంలో వెంటనే తగు నివారణ చర్యలు తీసుకోకపోగా ఎదురుదాడి చేశారు. జరిగిన దాన్ని ఆక్షేపిస్తున్న ఎంఎల్ఎ మరి మరో 5 కోట్లు కలిపి డిపాజిట్ చేసేట్టయితే పాత వేలం రద్దు చేయిస్తానని కోర్టు హామీ ఇచ్చింది. అలా అనడమే అసాధారణం కాగా దానికి ఆర్కే అంగీకరించడంతో రాజకీయ న్యాయ పోరాటాల చరిత్రలో కొత్త మలుపు వచ్చింది. కేసుల విషయంలో ఆర్కే హ్యాట్రిక్ సాధించారని నేను సరదాగా అంటే ఆ రోజు చర్చకు వచ్చిన టిడిపి నాయకుడు ఆగ్రహౌదగ్రుడైనారు. ఓటుకు నోటు, స్విస్ ఛాలెంజి, సదావర్తి వేలం మూడు విషయాల్లోనూ ఆర్కే విజయాలు సాధించారు. ఆయన రాజకీయాలు నేపథ్యంపై ఎవరి ఉద్దేశాలు ఏమైనా ప్రజల సొమ్మును కాపాడ్డం అభినందనీయం. పైగా ఈ వేలంలో పాల్గొనవలసిందిగా కోర్టు ఇచ్చిన ఆదేశాన్ని ఆయన పాటించారు. పాత వేలం రద్దు చేయలేమని ప్రభుత్వం పేచీలు పెట్టింది. చివరి దశలో తమిళనాడు ప్రభుత్వం పేరిట కూడా కేసు దాఖలైంది. అయినా సరే చెన్నైలోని టిటిడి కార్యలయంలో వేలం జయప్రదంగా పూర్తి కావడం, కపడవాస్తవ్యులు సత్యనారాయణ రెడ్డి 60.30 కోట్లకు పాడుకోవడం తప్పు వాదనలు చేసిన వారికి పెద్ద పాఠమే. అందుకే ఇది వేలం పాట కాదు వేలం పాఠం.ఇలాటివి ఇంకా ఎన్ని వున్నాయో పరిశోధించి తీస్తే గాని తేలదు.