భారత్ వెలిగిపోతోందంటూ గతంలో భాజపా ఓ నినాదాన్ని తెరమీదికి తెచ్చింది. అటల్ బీహారీ వాజ్ పేయ్ హయాంలో దేశం దూసుకుపోతుందనీ, మరోసారి భాజపాకే అధికారం దక్కుతుందని అప్పట్లో భాజపా నినదించింది. కానీ, ఆ నినాదమే భాజపా ఓటమి కారణమైందనే విశ్లేషణలు ఉన్నాయి. పాలన బాగుంటే దేశం వెలిగిపోతోందనీ ప్రత్యేకంగా డోలుకొట్టి చెప్పనక్కర్లేదు కదా. ఆ వెలుగుల్ని ప్రజలు మళ్లీ కోరుకుంటే చాలు కదా! అయితే, ఆ తరువాత నుంచి భాజపా అలాంటి నినాదాల జోలికి వెళ్లలేదు. కానీ, ఇప్పుడు దాదాపు అలాంటి అతి విశ్వాసంలోకి భాజపా వెళ్తోందని అనిపిస్తోంది. తెలంగాణలో భాజపా బలోపేతం గురించి ఆ పార్టీ సీనియర్ నేత రామ్ మాధవ్ మాట్లాడారు. దేశంలో మరోసారి భాజపా అధికారంలోకి వచ్చేస్తుందని అందరూ డిసైడ్ అయిపోయారని ఆయన చెప్పడం విశేషం!
ఎన్నికలు వస్తున్నప్పుడు తాము గెలవడం కోసం ప్రయత్నిస్తున్నామంటూ రాజకీయ పార్టీలు చెప్పడం సర్వ సాధారణమైన విషయమని రామ్ మాధవ్ చెప్పారు. అయితే, 2019 ఎన్నికల విషయానికొస్తే తాము గెలవడం అనేది అందరూ ఓ నిర్ణయానికి వచ్చేసిన అంశమనీ, అది జరిగిపోయిందనీ, భాజపా మళ్లీ అధికారంలోకి రావడం అనేది దాదాపు ఖాయమైన విషయంగానే అందరూ చూస్తున్నారన్నారు. 2019 భాజపా గెలుస్తుందని ప్రతిపక్షాలకు కూడా తెలిసిపోయిందనీ, వారు కూడా చేతులు ఎత్తేసిన పరిస్థితి ఉందని రామ్ మాధవ్ అన్నారు. భాజపా మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనేది ఫిక్స్ అయిపోయిందన్నారు. దేశవ్యాప్తంగా 350 స్థానాల వరకూ పార్టీ గెలవాలన్న లక్ష్యంతో ఇప్పట్నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టామన్నారు. తెలంగాణలో ఇప్పటికే ఒక ఎంపీ స్థానం దక్కించుకున్నామనీ, మిగతా పదహారు స్థానాల్లో కూడా విజయావకాశాలు మెరుగుపరచుకోవాలనే ప్రయత్నంలో ఉన్నామన్నారు.
భాజపా గెలుపు జరిగిపోయిందని రామ్ మాధవ్ చెప్పడం, కాస్త అతి విశ్వాసంగానే ధ్వనిస్తోంది. ప్రతిపక్షాల ఆత్మవిశ్వాసాన్ని ప్రభావితం చేయడానికే ఆయన ఇలా మాట్లాడి ఉండొచ్చు. మరోసారి భాజపా అధికారంలోకి రావడం తప్పేం లేదుగానీ… ప్రజలు ఎందుకు భాజపాకి మరోసారి అధికారం ఇవ్వాలని అనుకుంటున్నారనేది రామ్ మాధవ్ చెబితే బాగుండేది. దేశం మరోసారి మోడీ నాయకత్వాన్ని ఎందుకు కోరుకుంటోంది, ఏయే నిర్ణయాల వల్ల మరోసారి మోడీ కోసమే దేశం చూస్తోంది, ప్రతిపక్షాలను ప్రజలు ఎందుకు నమ్మరు అనేవి సవివరంగా చెబితే అది వేరేలా వినిపించేది. పెద్దనోట్ల రద్దు నిర్ణయం వల్ల ఏం సాధించారో ప్రజలకు ఇప్పటికీ చెప్పలేకపోతున్నారు. దేశవ్యాప్తంగా వస్తు సేవల పన్ను ఒకటే ఉంటుందనీ, దాని ద్వారా అద్భుతాలు జరుగుతాయని చెప్పారు. అలా ఆవిష్కృతమైన అద్భుతాలేంటో వివరించలేకపోతున్నారు. పెట్రోల్, గ్యాస్ ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతున్నాయి. నిత్యావసరాల సంగతి అయితే సరేసరి. అచ్చే దిన్ ఆయేగా అన్నారు.. అవెలా ఉంటాయో ఎప్పుడొచ్చాయో కూడా చెప్పలేకపోతున్నారు. ఒక్క స్వచ్ఛ భారత్ గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. దాని గురించే భారీ ప్రచారం చేస్తున్నారు.
ముందుగా, మోడీ హయాంలో సాధించిన విజయాలు గురించి మాట్లాడితే బాగుంటుంది. ఆ తరువాత, 2019లో ఎవరికి అధికారం ఇవ్వాలనేది ప్రజలే చెబుతారు కదా! రాబోయే ఎన్నికల గురించి, వాటి ఫలితాల గురించి ఇప్పట్నుంచీ ఈ అతి విశ్వాసపు ప్రకటనలు ఎందుకు..?