ఎన్టీఆర్ బయోపిక్ అనే అస్త్రాన్ని సంధించడానికి సమాయాత్తం అవుతున్నాడు రాంగోపాల్ వర్మ! తీస్తాడో, లేదో తెలీదు గానీ… ఇలాంటి స్టేట్మెంట్లు చాలా చాలా ఇచ్చాడాయన. కాకపోతే.. ‘ఎన్టీఆర్’ అనేది సేలబుల్ పాయింట్. దాన్ని వర్మ కూడా తేలిగ్గా వదలడు.. ఫుల్లుగా వాడేసుకొంటాడు. ఎన్టీఆర్ బయోపిక్ బాలయ్యతో తీసినా తీయకపోయినా – దాన్ని సొమ్ము చేసుకోకుండా వదలడు వర్మ. కాకపోతే బాలయ్యతో ఈ సినిమా తీస్తే… ఆ సినిమాకున్న రేంజు పెరుగుతుంది. అప్పుడు ఇంకాస్త ఎక్కువ పిండుకోవొచ్చు. అంతే తేడా.
ఎన్టీఆర్ బయోపిక్ తీస్తా… అని బాలయ్య ప్రకటించడం పాపం. ‘ఆ సినిమాకి దర్శకుడ్ని నేనే’ అనే రేంజులో ఓ ఫీలర్ వదిలాడు వర్మ. వర్మ టెక్నిక్కులు బాగా పనిచేశాయి. బాలయ్య తీసే ఎన్టీఆర్ సినిమాకి వర్మనే దర్శకుడేమో అని మీడియా కూడా అనేసుకొంది. కానీ.. వాస్తవాలు వేరు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎన్టీఆర్ బయోపిక్ చేసే అవకాశం రాంగోపాల్ వర్మకు బాలయ్య ఇవ్వడు గాక ఇవ్వడు. సో… వర్మ ఇప్పుడు అడ్డదార్లు పట్టాల్సిందే. అందుకే ‘లక్ష్మీ పార్వతి కోణంలో ఎన్టీఆర్ బయోపిక్ తీస్తా’ అంటూ ఓ బాంబ్ విసిరాడు. లక్ష్మీ పార్వతి కోణంలో అంటే… చాలామంది జాతకాలు బయటపడిపోతాయి. అందులో అప్పటి ‘వెన్నుపోటు’ ఘట్టం కూడా ఉండక తప్పదు. దాన్నే హైలెట్ చేసి ‘ఇదే.. ఎన్టీఆర్ చరిత్ర’ అంటూ వర్మ తన కోణంలోంచి ఓ స్టేట్మెంట్ ఇచ్చినా ఇచ్చేస్తాడు.
2019 ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో తెలుగు దేశం పార్టీకి గానీ, అదినేత చంద్రబాబు నాయుడుకి గానీ – ఇలాంటి తలనొప్పులు అస్సలు మంచిది కాదు. ‘వర్మ ఏం కొంప ముంచుతాడో..’ అని బాలయ్య భయపడి.. ఎన్టీఆర్ బయోపిక్ తీసే అవకాశం వర్మకే ఇచ్చేస్తాడన్న మిడి మిడి నమ్మకంతో ఇప్పుడు వర్మ సరికొత్తగా లక్ష్మీపార్వతాస్త్రం సంధించడానికి రెడీ అయ్యాడు. బాలయ్య ఇలాంటి వాటికి భయపడతాడా..? వర్మ టెక్నిక్కులు బాలయ్య ముందు పనిచేస్తాయా?? కాకపోతే ఒకటి.. ఇటు బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ తీస్తున్న తరుణంలోనే వర్మ కూడా పోటీగా బయోపిక్ మొదలెట్టేసి, బాలయ్య కంటే ముందు విడుదల చేస్తే మాత్రం ఎన్టీఆర్బయోపిక్ కి ఉండాల్సిన గ్లామర్ తగ్గిపోతుందన్నది వాస్తవం. ఆ కోణంలోనే ‘నేనూ బయోపిక్ తీస్తా.. తీస్తా’ అని వర్మ భయపెడుతున్నాడంతే! మరి ఈ ఎత్తులకు, జిత్తులకు బాలయ్య ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.