నంద్యాల ఉప ఎన్నిక ప్రభావం రాజకీయ వలసలపై ఉంటుందనేది ముందునుంచీ ఊహిస్తున్నదే. తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడంతో ఆ ప్రభావం ఇప్పుడు కర్నూలు జిల్లా రాజకీయంపై స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇతర పార్టీల నుంచి తెలుగుదేశం వైపు తొంగి చూస్తున్నవారు పెరుగుతున్నారంటూ ఇప్పటికే ఆ పార్టీ నేతలు లీకులు ఇస్తున్నారు. అయితే, అవన్నీ ఇతర పార్టీల మనో భావాలను ప్రభావితం చేసేవిగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు కర్నూలు జిల్లాలో ఓ ప్రముఖ నాయకుడి రాజకీయ భవిష్యత్తు ఎటువైపు అనే చర్చ మొదలైందని సమాచారం. కర్నూలు జిల్లా రాజకీయాల్లో దివంగత మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయ భాస్కర్ రెడ్డి కుటుంబానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆయన మరణించాక, కోట్ల కుమారుడు సూర్యప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ కు పెద్ద దిక్కుగా మారారు. రాష్ట్ర విభజన తరువాత కాంగ్రెస్ తుడిచిపెట్టుకుని పోయినా ఆయన మాత్రం పార్టీని విడిచిపెట్టి పోలేదు. జిల్లాలోని ప్రముఖ కాంగ్రెస్ నేతలందరూ పార్టీకి రామ్ రామ్ చెప్పేసినా, ఈయన ఒక్కరే పార్టీని నమ్ముకుని కూర్చున్నారు. మంచిరోజులు వస్తాయనే ఆశాభావంతో ఎదురుచూస్తున్నారు.
అయితే, నంద్యాల ఉప ఎన్నిక తరువాత ఆయన స్వరం కూడా కాస్త మారిందని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది! నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ, వైకాపాలకు ధీటుగా కాంగ్రెస్ ప్రచారం నిర్వహించింది. ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డితోపాటు, కోట్ల, ఇతర సీనియర్ నేతలు కూడా నంద్యాలలో భారీ ఎత్తున ప్రచారం నిర్వహించారు. ఇంత చేసినా కనీసం ఓ పదిహేను వందల ఓట్లైనా కాంగ్రెస్ కు దక్కని పరిస్థితి. ఈ ఫలితం తరువాత కోట్ల సూర్యప్రకాష్ అనుచరగణంలో చర్చ మొదలైందనీ, పార్టీ మారితే తప్ప రాజకీయ భవిష్యత్తు ఉండదనే అంశాన్ని ఆయన సన్నిహితులు కోట్ల దగ్గర తరచూ ప్రస్థావిస్తున్నారంటూ ఓ కథనం చక్కర్లు కొడుతోంది. నిజానికి, ఆయన పార్టీ మారతారూ అనే ఊహాగానాలు గత ఎన్నికలు ముగిసిన దగ్గర్నుంచే మొదలయ్యాయి. అయితే, వాటిని ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తున్నారు. ఇప్పుడు నంద్యాల ఫలితం తరువాత భవిష్యత్తులో కాంగ్రెస్ తేరుకునే పరిస్థితులు కనిపించడం లేదనే అంచనా వేస్తున్నారట!
ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన తెలుగుదేశంవైపు చూసే అవకాశాలున్నట్టు ప్రచారం సాగుతోంది. ఎందుకంటే, ఇటీవలే ఆయన తన వ్యక్తిగత పని విషయమై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలుసుకున్నారు. ఈ తరుణంలో దాదాపు ఓ గంటసేపు ఇద్దరి మధ్యా చర్చ జరిగింది. కోట్లతో తనకు ఉన్న అనుబంధాన్ని చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేశారట. అంతేకాదు, సూర్యప్రకాష్ రెడ్డిని తెలుగుదేశంలోకి రమ్మంటూ ఆహ్వానించినట్టు కూడా చెబుతున్నారు. పదవిని కూడా ఆఫర్ చేసినట్టు చెప్పుకుంటున్నారు. ఇక, వైకాపా నుంచి కోట్లకు పిలుపులు అందుతున్నా… నంద్యాల ఫలితం నేపథ్యంలో ఆంధ్రాలో వైకాపాకి భవిష్యత్తు ఉండదనే అంచనాకు వచ్చినట్టు చెబుతున్నారు. అంతేకాదు, కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి కుటుంబంతో జగన్ సరిగా వ్యవహరించని గతాన్ని కూడా గుర్తు చేసుకుంటున్నట్టు సమాచారం. మొత్తానికి, కోట్ల కుటుంబం సైకిల్ ఎక్కే అవకాశం ఉందనే కథనాలు ఇప్పుడు చర్చనీయం అవుతున్నాయి.