బతుకమ్మ కానుక చీరల లొల్లి ఇప్పట్లో చల్లారేట్టుగా కనిపించడం లేదు. తెలంగాణ ఆడపడుచులకు పండుగ కానుక అంటూ కేసీఆర్ సర్కారు ఇచ్చిన చీరలు అత్యంత నాసిరకంగా ఉన్నాయంటూ కొన్ని చోట్ల మహిళలు అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే, దీనిపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. ఇదంతా కృత్రిమ ఆందోళనలనీ, కాంగ్రెస్ ప్రేరిత కార్యక్రమాలనీ, రాష్ట్రంలో మంచి పనులు జరుగుతుంటే చూస్తూ ఓర్వలేకపోతున్నారనీ, గతంలో ఎప్పుడైనా తెలంగాణ ఆడపడుచులకు చీరలిచ్చే ఆలోచన కాంగ్రెస్ చేసిందా అంటూ ఆయన చాలా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. మంత్రి విమర్శలపై కాంగ్రెస్ నేతలు కూడా ఏమాత్రం తగ్గడం లేదు.
మాజీ మంత్రి డీకే అరుణ స్పందిస్తూ… ప్రజల సొమ్మును కేసీఆర్ సర్కారు దోచుకుంటూ ఉంటే చోద్యం చూస్తూ కూర్చోమని అన్నారు. నాసిరకం చీరలు ఇచ్చిన మహిళలకు నష్టపరిహారం కింద కొంత సొమ్ము వారి బ్యాంకు ఖాతాల్లో వేయాలని ఆమె డిమాండ్ చేశారు. తెలంగాణ ఆడపడుచులకు చీరలిస్తే మంచిదేననీ, కాకపోతే ఆ చీరల ఖర్చు తెరాస పార్టీ ఫండ్ నుంచి పెడితే బాగుండేదన్నారు. మీ పార్టీ ఫండ్ నుంచి ఖర్చు పెడితే ప్రశ్నించేవాళ్లం కాదనీ, ఇది ప్రజల సొమ్ము అనీ, దుర్వినియోగం చేస్తుంటే ప్రశ్నించాల్సిన బాధ్యత తమకు ఉందని ఆమె అన్నారు. ఇదే అంశమై కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కూడా స్పందించారు. తెరాస సర్కారు తమను నీచంగా చూస్తోందని ప్రజలు ఆవేదన చెందుతున్నారంటూ విమర్శించారు. రూ. 30 చీర చేతిలో పెడితే, అది కానుక ఎలా అవుతుందనీ, ప్రజల్ని అవమానించడమే అవుతుందన్నారు.
కోట్లకు కోట్లు ఖర్చు పెట్టి మేడలు కట్టుకున్నారనీ, కార్లలో తిరుగుతూ తిరుగున్నారనీ, ప్రజలంటే ఇంత చులకన అయిపోయిందా అంటూ మండిపడ్డారు. మాజీ మంత్రి షబ్బీర్ అలీ కూడా ఏమాత్రం తగ్గలేదు. ఆ చీరల్ని కవితను కట్టుకోమనీ, వాటితోనే న్యూజీలాండ్ కి పోయి రావాలని అన్నారు. సూరత్ లో కిలోకి ఆరు చీరలు వస్తాయనీ, వాటి ఖరీదు రూ. 200 ఉంటుందని షబ్బీర్ చెప్పారు. మంత్రి కేటీఆర్ ను ఉద్దేశించి మాట్లాడుతూ… హీరోయిన్ సమంతాను బ్రాండ్ అంబాసిడర్ చేశారు కదా, ఆమెని ఈ చీరలు కట్టుకోమని చెప్పు అంటూ ఎద్దేవా చేశారు. జీవన్ రెడ్డి కూడా మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డారు.
కాంగ్రెస్ నేతలందరూ మూకుమ్మడిగా కేటీఆర్ వ్యాఖ్యల్ని తప్పుబట్టారు. మొత్తానికి కాంగ్రెస్ కి ఒక మంచి విమర్శనాస్త్రమే దొరికింది. అయితే, అధికార ప్రతిపక్షాల మధ్య విమర్శల వరకూ బాగానే ఉంది! కానీ, ఈ వివాదంపై తదుపరి ఎలాంటి పరిణామాలుంటాయి..? చీరల కాల్చే ఘటనలు కాంగ్రెస్ ప్రేరితం అని అధికార పార్టీ అంటొంది. నాసిరకం చీరలిచ్చి మమ్మల్ని మధ్యలోకి ఎందుకు లాగుతారని కాంగ్రెస్ అంటోంది. అయితే, ఈ వివాదంలో తరువాత ఏం జరుగుతుంది..? మహా అయితే.. మరో రెండుమూడు రోజులు ఈ టాపిక్ వార్తల్లో ఉండొచ్చు. పోనీ.. ఆ తరువాతైనా ఏదైనా జరుగుతుందా అంటే… ఏదీ జరగదనే చెప్పాలి. ఎలాగూ అధికార పార్టీ చెప్పుచేతల్లో కావాల్సినంత మీడియా కూడా ఉంది కాబట్టి, ఈ కథనాలకు ప్రాధాన్యత అలాఅలా తగ్గిపోతుందనే అనిపిస్తోంది.