రాజమౌళి కలల చిత్రం మహాభారతం. అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమాని రూపొందించాలన్నది రాజమౌళి కల. అయితే ‘ఈ సినిమాని ఇప్పుడే తీయను.. కనీసం పదేళ్ల సమయం తీసుకొంటా’ అని రాజమౌళి కూడా చాలా సందర్భాల్లో చెప్పాడు. కాస్త లేటయినా.. తియ్యడం మాత్రం ఖాయం. అందుకే అమీర్ ఖాన్ లాంటి వాడు కూడా ‘రాజమౌళి మహాభారతం తీస్తే నేనూ నటిస్తా’ అని ఉత్సాహం ప్రదర్శించాడు. ఇప్పుడు ఎన్టీఆర్‌దీ అదే మాట. ‘మహాభారతం లాంటి సినిమాలో నటించాలనివుంది. రాజమౌళి తీస్తున్నాడు కదా.. నాకేమైనా పాత్ర ఇస్తే చూడాలి.. ఎలాంటి పాత్ర ఇచ్చినా తప్పకుండా చేస్తా. అయితే.. ఇది కేవలం నా ఆశ మాత్రమే. నన్ను తీసుకొంటాడో, లేదో రాజమౌళి ఇష్టం. అది రాజమౌళి చెబితేనే బాగుంటుంది’ అంటున్నాడు తారక్.
అంటే.. తారక్ వైపు నుంచి కూడా ఈ సినిమాకి కర్చీఫ్ పడిపోయినట్టే. పౌరాణిక పాత్రలు చేయదగ్గ దమ్ము, ధైర్యం… ఎన్టీఆర్‌కి ఉన్నాయడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకవేళ మహాభారతంలోకి కీలక పాత్రల కోసం తెలుగు చిత్రసీమ నుంచి స్టార్ హీరోల్ని ఎంచుకోవాల్సిందే అని రాజమౌళి భావిస్తే అందులో కచ్చితంగా ఎన్టీఆర్ పేరు ఉంటుంది. అయితే.. ఎన్టీఆర్‌కి తగిన పాత్ర ఏంటన్నది రాజమౌళినే ఆలోచించాలి. ఎన్టీఆర్ అభిమానులు మాత్రం తమ హీరోని శ్రీకృష్ణుడు స్థాయి పాత్రలో ఊహించుకోవడం గ్యారెంటీ. ఎన్టీఆర్ మనసులోనూ శ్రీకృష్ణుడున్నాడేమో. ఆయన మాత్రం బయటపడలేదు.
ఇక్కడ పాయింటు ఎవరి మనసులో ఎవరున్నారన్నది కాదు. రాజమౌళి ఏ పాత్ర కోసం ఎవరిని ఊహించుకొంటున్నాడన్నది కీలకం. మహాభారతానికి ఇంకా రాజమౌళి లెక్కల్లో పదేళ్ల సమయం ఉంది. ఆ సమయానికి కృష్ణుడెవరో, కర్ఱుడెవరో. కాకపోతే ఒకటి మాత్రం నిజం.. ఈ సినిమాలో నటించడానికి ఎవరికి వాళ్లు, వాళ్ల వాళ్ల స్థాయిలో కర్చీఫ్‌లు రెడీ చేసుకొంటున్నారు. అందులో ఎన్టీఆరూ ఉన్నాడు.