అమరావతిలో నిర్మాణ నమూనాలపై సూచనలు ఇవ్వడం కోసం లండన్ వెళ్లి నార్మన్ పోస్టర్స్‌తో సంప్రదింపులలో పాల్గొనడానికి దర్శకుడు రాజమౌళి అంగీకరించడం వూహించిన విషయమే. రాజమౌళి వివాదాలకు దూరంగానూ వినమ్రంగా మాట్లాడుతుంటారు. అమరావతిపై నడుస్తున్న చర్చ వివాదం ఆయనకు తెలియకుండా వుండవు. ఈ సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తన సూచనలు కోరితే ఇవ్వబోనని చెప్పడం జరగని పని. మొదట్లోనైతే ఆ ప్రయత్నం చేశారు. తాను గంట సేపు మాట్లాడానని అందులో 45 నిముషాలు తను ఈ పనిచేయలేనని చెప్పడానికి కేటాయించానని గతంలో ఆయనే చెప్పారు.ఇప్పుడు ప్రతిపక్షాల విమర్శల మధ్య అలా చేస్తే ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతింటుందని రాజమౌళికి తెలుసు.పైగా తోచిన సూచనలు అడిగితే కాదని తప్పించుకోవడం బాద్యతా రహితమవుతుంది. ఈ కారణం వల్లనే రాజమౌళి అమరావతి సందర్శించి చంద్రబాబుతో ఒకటికి రెండుసార్లు చర్చలు జరిపారనుకోవాలి. తన బృందంతో లండన్ వెళ్లడానికి కూడా సిద్ధమయ్యారు. ఈ తతంగమంతా ముగిసి తుది నమూనాలు నిర్మాణాల వరకూ రావడానికి ఎలాగూ ఏడాదిపైనే పడుతుంది.