నంద్యాల ఉప ఎన్నిక ఫలితాల తరువాత కర్నూలు జిల్లా రాజకీయాల్లో మార్పులకు సంబంధించి కొన్ని కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే. దీన్లో ప్రధానంగా వినిపిస్తున్నది కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పార్టీ మార్పు! ఆయన మొదట్నుంచీ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రాలో కాంగ్రెస్ ఉనికి కోల్పోయినా, ప్రముఖ నేతలంతా ఇతర పార్టీలోకి వెళ్లిపోయినా కోట్ల మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. అయితే, ఎప్పటికప్పుడు ఆయన పార్టీ మారతారనే కథనాలు వస్తూనే ఉంటాయి, వాటిని ఖండిస్తూనే ఉంటారు. తాజాగా మళ్లీ అదే పరిస్థితి వచ్చింది! కోట్ల కుటుంబం తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశం ఉందనీ, ఇటీవల ముఖ్యమంత్రి నారా చంద్రబాబుతో కోట్ల భేటీ అయిన సందర్భంగా ఈ ప్రతిపాదన వచ్చినట్టు కూడా చాలామంది అభిప్రాయపడ్డారు. మీడియాలో కూడా కోట్ల రాజకీయ భవిష్యత్తుపై కథనాలు వచ్చాయి. ఈ వార్తలపై కోట్ల స్పందించారు.
తాను పార్టీ మారే ఆలోచన లేదనీ, అలా వస్తున్న కథనాల్లో ఎలాంటి వాస్తవం లేవని సూర్యప్రకాష్ రెడ్డి తేల్చి చెప్పారు. కాంగ్రెస్ లోనే కొనసాగుతాననీ, పార్టీకి భవిష్యత్తు లేకపోతే తాను రాజకీయాల నుంచి దూరం అవుతానని, వ్యవసాయం చేసుకుంటానని చెప్పారు. అంతేతప్ప, ఇతర పార్టీల్లో చేరే ఆలోచన అస్సలు లేదని ఆయన స్పష్టం చేసేశారు. అయితే, ఇదే సందర్భంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురించి కోట్ల ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈవారంలో ముఖ్యమంత్రి తన ఇంటికి వస్తానని కబురు పెట్టారన్నారు! అయితే, కారణాలేవో తనకు తెలీదుగానీ ముందుగా ఇచ్చిన సమాచారం ప్రకారం చంద్రబాబు రాలేదని కోట్ల చెప్పారు. ముఖ్యమంత్రి తన ఇంటికి ఎప్పుడు రావాలనుకున్నా మనస్పూర్తిగా సాదరస్వాగతం పలుకుతానని కోట్ల చెప్పారు.
పార్టీ మార్పుపై కోట్ల ఇలాంటి స్పష్టత ఇచ్చేశారు! ఆయన అభిప్రాయం ఇలా ఉంది కాబట్టే, చంద్రబాబు కోట్ల ఇంటికి వెళ్లాలనుకునే ఆలోచనను విరమించుకుని ఉంటారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, కోట్ల అనుచర వర్గాలు మాత్రం ఆయనపై ఒత్తిడి చేస్తున్నట్టుగానే చెబుతున్నారు! కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో భవిష్యత్తు లేదనీ, నేటి రాజకీయాల్లో పార్టీ మార్పు అనేది సర్వసాధారణ విషయమనీ, ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ఏదో ఒక పార్టీలో చేరడం తప్పు కాదనే విధంగా కోట్లను బుజ్జగించే ప్రయత్నం కొంతమంది నేతలు చేస్తున్నట్టు సమాచారం! కోట్లతో మంతనాలు జరిపే విషయమై తెలుగుదేశంలో కొంత చర్చ జరుగుతోందన్న కథనాలు కూడా వినిపిస్తున్నాయి. పార్టీ మార్పు ఉండదని కోట్ల స్పష్టత ఇచ్చేసినా, ఈ కథనాలు ఆగేట్టుగా పరిస్థితి లేదనే అనిపిస్తోంది.