ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతోనే తాను రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నట్టుగా మాజీ హీరోయిన్ వాణీ విశ్వనాథ్ ఆ మధ్య ప్రకటించిన సంగతి తెలిసిందే! తనకు ఎంతో ఇచ్చిన తెలుగు ప్రజల కోసం తాను ఏదో ఒకటి చేయాలనే ఆలోచన వచ్చిందని అంటోందీ మలయాళ నటి. వాణీ విశ్వనాథ్ కు తెలుగుదేశం టిక్కెట్ ఇస్తుందనే ప్రచారం కూడా ఓ పక్క జరుగుతోంది. అది కూడా వైకాపా ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్ రోజా ప్రాతినిధ్యం వహిస్తున్న నగరి నియోజక వర్గం నుంచి వాణీని బరిలోకి దింపే అవకాశాలున్నట్టుగా కథనాలు వస్తున్నాయి. అంతేకాదు, నగరిలో వాణి పర్యటనలు కూడా జరిగిపోయాయి. అయితే, ప్రస్తుతం నగరి టీడీపీలో ఇంకోరకమైన చర్చకు తెర లేచినట్టు సమాచారం. నగరి నియోజక వర్గం నుంచి వాణీ విశ్వనాథ్ ను బరిలోకి దించాలనే ఆలోచనపై ఆ పార్టీ వర్గాలే గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది!
ఎందుకంటే, స్థానికంగా గాలి ముద్దుకృష్ణమ నాయుడు బలమైన సీనియర్ నేత. 2014 ఎన్నికల్లో ఆయన ఓ ఎనిమిది వందల ఓట్ల తేడాతో ఓడిపోయారు, రోజా గెలుపొందారు. అయితే, నగరి నియోజక వర్గంలో గాలికి మంచి పట్టే ఉంది. అన్నివేళలా ఆయన ప్రజలకు అందుబాటులో ఉంటారనే ఇమేజ్ కూడా ఉంది. ఎమ్మెల్యేగా ఓటమి చవి చూసినా, ఆయన జిల్లా రాజకీయాల్లో క్రియాశీలంగానే ఉంటూ వస్తున్నారు. ఆ తరువాత, ఎమ్మెల్సీ అయ్యారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ మధ్య నియోజక వర్గ వ్యవహారాల్లో కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఇంకోపక్క గాలి కుమారులు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి రాజకీయ భవిష్యత్తుకు పునాదులు వేసుకుంటున్నారు. స్థానికంగా ఇంత బలమైన నేత ఉండగా.. మాజీ సినీ నటిని నగరికి తీసుకురావాల్సిన అవసరం ఏముందనేదే గాలి వర్గంలో జరుగుతున్న చర్చ!
కేవలం రోజాను ఎదుర్కోవడం కోసం అదే స్థాయి సినీ గ్లామర్ ఉన్న నాయకురాలి అవసరం ఉందన్న ప్రాతిపదికతోనే వాణీని తెస్తున్నారనే ప్రచారం ఉంది. ఒకవేళ టీడీపీ అధినాయకత్వం ఉద్దేశం అదే అయితే.. స్థానికంగా టీడీపీలో అసంతృప్తులు తప్పవనే అనిపిస్తోంది. వాణీకి మద్దతు ఇచ్చే టీడీపీ నాయకులు ఎవరనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. ఎన్నోయేళ్లుగా నగరి నియోజక వర్గంలో పార్టీకి పెద్ద దిక్కుగా ఉంటూ వస్తున్న గాలి వర్గంలో ఇప్పటికే ఈ చర్చ మొదలైందని సమాచారం. ఆయన్ని కాదని వాణీకి అవకాశం ఇవ్వాలన్నదే అధిష్టానం ఆఖరి నిర్ణయమైతే నిరసన తెలిపేందుకు కూడా గాలి వర్గీయులు సిద్ధంగా ఉన్నట్టు చెబుతున్నారు! కేవలం రోజా మీద పోటీ కోసమే వాణీ విశ్వనాథ్ ను తీసుకొచ్చినట్టయితే.. క్షేత్రస్థాయిలో సమీకరణలు మారిపోయే అవకాశం ఉంది. మరి, గాలి వర్గంలో జరుగుతున్న ఈ చర్చ సీఎం చంద్రబాబు వరకూ చేరే ఉంటుంది కదా! ఇంతకీ, ఆయన విజన్ ఏంటో వేచి చూడాలి. లేకపోతే వాణీ విశ్వనాథ్ విషయం ఇంతవరకూ రాదు కదా!