ఆంధ్రాలో అధికార పార్టీకి వెన్నుదన్ను మీడియా ఏదనేది బహిరంగ రహస్యం. ఆ మీడియాకి టీడీపీ చేపట్టే కార్యక్రమాలపైనా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అమలు చేస్తున్న ఆలోచనలపైనా ఎంతో బాధ్యత ఉంటుంది! పార్టీ ఆలోచనా విధానాలను ఆత్మీకరించుకుని, దిశానిర్దేశం చేసే బాధ్యతను అప్రకటితంగానే వారు తీసుకుంటారు. తాజాగా వచ్చిన ఓ కథనమే అందుకు నిదర్శనం! ‘ఇంటింటికీ తెలుగుదేశం’ అనే కార్యక్రమాన్ని ఇటీవలే ముఖ్యమంత్రి ప్రారంభించిన సంగతి తెలిసిందే. అన్ని నియోజక వర్గాల నేతలూ ఇంటింటికీ వెళ్లాలనీ, టీడీపీ చేస్తున్న అభివృద్ధి పథకాలను ప్రచారం చేయాలనేది ఈ కార్యక్రమం ఉద్దేశం. అంతేకాదు, ఇప్పటికీ ప్రభుత్వ పథకాలు అందనివారు ఎవరైనా ఉంటే, ప్రభుత్వం ఇచ్చిన ట్యాబ్ ల ద్వారా ఆ సమాచారం పంపితే.. వాటిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంటుంది. ఓవరాల్ గా ఇంటింటికీ టీడీపీ డిజైన్ ఇది.
అయితే, క్షేత్రస్థాయిలో పరిస్థితి కాస్త వేరేగా ఉంది. ఈ కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించడంలో 57 నియోజక వర్గాలు వెనకబడి ఉన్నట్టు పార్టీ నాయకత్వం గుర్తించిందట! ఆయా నియోజక వర్గాల ఎమ్మెల్యేలు, ఇన్ ఛార్జులు, ఇతర నేతలతో పార్టీ కార్యాలయమే నేరుగా మాట్లాడిందట! ఆ నేతలకు గట్టి వార్నింగ్ ఇచ్చిందట! ఇంతకీ ఏమని మందలించిందంటే.. రాజకీయంగా ఇది ఎంతో ముఖ్యమైన కార్యక్రమం అనీ, ముఖ్యమంత్రి ఎంతో విజన్ తో దీన్ని ప్రారంభించారనీ, నిర్లక్ష్యం చేస్తే రాజకీయంగా మీ భవిష్యత్తుకే ఇబ్బంది అనేది గుర్తించాలని పార్టీ కార్యాలయం సదరు నేతలకు చెప్పిందట. సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు జరిగితే, రాజకీయంగా స్థానిక నేతలకే ప్రయోజనం ఉంటుందని వివరించారట. ఆ మీడియాలో వచ్చిన కథనం ఇది.
ఇంటింటికీ టీడీపీ అనే కార్యక్రమం ఆచరణలో నత్తనడకన సాగుతోందనేది అసలు విషయం. ఆ విషయమై ముఖ్యమంత్రి ఆగ్రహంతో ఉన్నారని రాస్తే.. ప్రతిష్టాత్మకమైన ఈ ప్రొగ్రామ్ విఫలమౌతోందని ఆయనే ఒప్పుకున్నట్టు అవుతుంది. అది ప్రతిపక్షాలకు విమర్శనాస్త్రంగా మారుతుంది. అలా కాకుండా.. పార్టీ కార్యాలయమే హెచ్చరికలు జారీ చేశారని రాస్తే, ఇక్కడ ‘చంద్రబాబు’ అనే టాపిక్ రాదు కదా! సరే, టీడీపీ నాయకత్వం హెచ్చరించిందీ అంటే.. ఆ నాయకత్వం ఎవరు..? చంద్రబాబు నాయుడే కదా. అదే విషయాన్ని నేరుగా చెప్పకుండా.. అత్యంత ఉన్నతమైన ముఖ్యమంత్రి ఆలోచనను నాయకులు అర్థం చేసుకోవాలనే మందలింపు ధోరణితో ఆ మీడియాలో కథనం వచ్చింది. వారి ప్రెజెంటేషన్ ఏంటనేది ఇక్కడే అర్థమౌతోంది.
పార్టీ పట్ల వారిది ఎంత బాధ్యతో చూడండి! కొన్ని చోట్ల ఫెయిల్ అవుతున్న కార్యక్రమాన్ని కూడా ఎంతో చాకచక్యంతో ఆ ఫెయిల్యూర్ తో పార్టీకి సంబంధం లేనట్టు చిత్రించారు. ఇలాంటి కథనాల నుంచి ప్రతిపక్ష పార్టీ నేర్చుకోవాల్సింది చాలా ఉంది కదా! పార్టీకి అండగా ఉండటం అంటే ఎలాగో అనేది సాక్షి గుర్తెరగాలి! వైకాపా కూడా ఇప్పుడు వైయస్సార్ ఫ్యామిలీ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో నిర్వహిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద స్థాయిలో వైయస్సార్ అభిమానులను గుర్తించడం, ఓటు బ్యాంకు తయారు చేసుకోవడం ఈ కార్యక్రమ ముఖ్యోద్దేశం. అయితే, ఈ కార్యక్రమం అమలుపై సాక్షి పర్యవేక్షణ ఏదీ..? నాయకులకూ కార్యకర్తలకూ ఈ తరహా దిశా నిర్దేశం చేస్తోందా..? ఇలాంటి కథనాలు వస్తున్న సందర్భంలోనైనా ఆత్మ విమర్శ చేసుకునే అవకాశం ఉంటుంది. ఏదేమైనా, అధికార పార్టీకి అండగా నిలుస్తున్న ఆ మీడియా బాధ్యతను, రచనా నైపుణ్యాలను మెచ్చుకోవాల్సిందేనండీ!