చెన్పైలోని సదావర్తి భూముల వేలం పాట కథ మళ్లీ మొదటికి వచ్చిన తీరు చాలా వెగటు పుట్టిస్తుంది. ఈ భూములను కారుచౌకగా టిడిపి వారికి కట్టబెట్టారని కేసు వేసిన వైసీపీ ఎంఎల్ఎ ఆళ్ల రామకృష్ణారెడ్డి కోర్టు చెప్పినట్టుగా 22+5 కోట్లు జమచేశారు. తర్వాత జరిగిన వేలం పాటలో పాల్గొని 40 కోట్ల వరకూ పాడారు. ఆ తర్వాత కడప జిల్లాకు చెందిన సత్యనారాయణ బిల్డర్స్వారు 60కోట్లకు పైన పాడి పాట దక్కించుకున్నారు. ఇంతవరకూ బాగానే వుంది. ఈ దశలో సాక్షిలో వారు లోకేశ్ మనుషులంటూ కథనాలు వచ్చాయి. అయతే అదే సాకుగా చూపించి పాటదారులు తమ వంతు డబ్బు కట్టకుండా వెనక్కుపోవడం, లీగల్ పేచీలు పెట్టడం ఏం సబబు? వైసీపీ వారు తమను బెదిరిస్తున్నారని కూడా పాటదార్లు ఆరోపించారు. అదే నిజమైతే ప్రభుత్వం రక్షణ కల్పించాలి కదా! అంటే ఏదో ఒక సాకుతో మళ్లీ వెనక్కు పోవడమేనన్నమాట. దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాల రావు పాటదారుడు డబ్బు కట్టకపోతే కోర్టుకు వెళతామని అంటున్నారు. కాని ఆ శాఖ కమిషనర్ మాత్రం ఆ పాటదారుడు రాకుంటే తర్వాతి వారికి ఇచ్చేస్తామని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.ఇంకో వైపున మంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి ప్రభుత్వ పాత్రను వదిలేసి వైసీపీ ఎంఎల్ఎపై దాడి చేస్తున్నారు. వెయ్యికోట్ల విలువైన భూములని చెప్పిన మీరు 40 కోట్ల దగ్గరే ఎందుకు ఆగిపోయారు? 500 కోట్టయినా కట్టి స్వాధీనం చేసుకోండని సవాలు చేస్తున్నారు! మరో ఎంఎల్సి బుడ్దావెంకన్న వైసీపీ వారు వేలానికి అడ్డుపడుతున్నారని ఆరోపిస్తున్నారు,ఇక ఎంఎల్ఎ ఆర్కే ఇదంతా తెలుగుదేశం కుట్ర అనీ లోకేశ్ చంద్రబాబులపైనే ఆరోపణలు సంధిస్తున్నారు. మొత్తంపైన ప్రభుత్వం గట్టిగా అనుకుంటే ఇంత గందరగోళం వస్తుందా? పేలం పాట తర్వాత కూడా కథ అడ్డం తిరుగుతుందా? తెర వెనక రాజకీయాలేవో వున్నాయన్నది ఖాయం.