మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ నిర్వహించే సర్వేలకు బాగానే విశ్వసనీయత ఉందని చెప్పాలి. ఎందుకంటే, మిగతా సంస్థలతో పోల్చితే ఆయన చేయించిన సర్వేల ప్రకారమే గడచిన కొన్ని ఎన్నికల్లో ఫలితాలు వచ్చాయి. తాజాగా నంద్యాల ఉప ఎన్నిక విషయంలో కూడా ఆయన సర్వే చెప్పినట్టే టీడీపీ గెలిచింది. దీంతో టీడీపీలో ఆయన సర్వేలపై బాగా గురి ఏర్పడింది. లగడపాటి కూడా టీడీపీ లక్ష్యంగా చేసుకునే సర్వేలు నిర్వహిస్తున్నారా అనేలా ఇప్పుడు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి! ఎందుకంటే, తాజాగా ఓ సర్వే చేసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఆ ఫలితాలను లగడపాటి అందించారు. నంద్యాల ఉప ఎన్నికల సందర్భంలో కూడా ఇలానే చేశారు. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రిని కలుసుకున్నారు!
లగడపాటి తాజా సూచనలు ఏంటంటే.. పట్టణ ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీకి మాంచి ఆదరణ ఉందనీ, పల్లెల్లో కొన్ని గ్రూపులు ఉన్నాయనీ, 2014 నాటి పరిస్థితులే చాలాచోట్ల ఉందని తాజా నివేదికలో చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం పెంచుకునే విషయమై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. ఏయే అంశాలపై ప్రభుత్వం శ్రద్ధ వహించాలో కూడా చెప్పారట! గ్రామాల్లో రేషన్ కార్డులు, ఫించెన్లు, గృహ నిర్మాణాల హామాలపై చాలా డిమాండ్ ఉందనీ, ప్రజలు ఎక్కువగా కోరుకుంటున్న అంశాలు ఇవేనని చంద్రబాబుకు లగడపాటి వివరించారట! తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం నిర్వహిస్తున్న ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో కూడా లగడపాటి చెప్పినట్టుగానే ఫీడ్ బ్యాక్ వస్తోందని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. అందుకే, లగడపాటి చెప్పినట్టుగానే చర్యలు తీసుకోవాలని చంద్రబాబుకు కొంతమంది టీడీపీ నేతలు చెబుతూ ఉండటం విశేషం!
రాజగోపాల్ రాజకీయ సన్యాసం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ తరువాత, సర్వేలు చేసుకుంటూ వస్తున్నారు. కానీ, తాజాగా నిర్వహిస్తున్న సర్వేలు ఎలా ఉంటున్నాయంటే.. తెలుగుదేశం పార్టీకి సూచనలూ సలహాలూ ఇచ్చే విధంగా మారుతున్నాయి. ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వస్తాయనేది మాత్రమే చెప్పి ఆయన ఊరుకోవడం లేదు, సానుకూల ఫలితాలు సాధించేందుకు చేపట్టాల్సిన చర్యల్ని కూడా టీడీపీకి లగడపాటి చెబుతూ ఉండటం విశేషం. ఈ సర్వేల పేరుతో ఇప్పటివరకూ ముఖ్యమంత్రితో రెండు దఫాలు లగడపాటి భేటీ అయ్యారు! అంటే, ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేందుకు చేసే ప్రయత్నాల్లో భాగమే ఈ సర్వేలా..? లేదంటే, కేవలం టీడీపీకి మాత్రమే ఎందుకు సూచనలు ఇస్తారు..? ప్రతిపక్ష పార్టీకి కూడా ఇవ్వొచ్చుగా, కాంగ్రెస్ పార్టీ బాగుపడేందుకు చేపట్టాల్సిన చర్యల్నీ సూచించొచ్చు కదా! లగడపాటి తీరుపై ఇలాంటి అభిప్రాయాలే ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఏ ప్రయోజనమూ లేకుండా ఎవరైనా పనిగట్టుకుని మరీ అధికార పార్టీ ఉద్ధరణ కార్యక్రమాన్ని భుజాలకు ఎందుకు ఎత్తుకుంటారు..?