ఆంధ్రప్రదేశ్ లో భాజపా వ్యూహం ఏంటనేది ఆ పార్టీ నేతలకే స్పష్టతలేని అంశంగా పడుంది! తెలుగుదేశం పార్టీతో పొత్తు విషయమై రాష్ట్ర నేతలది ఒక అభిప్రాయం, జాతీయ నేతలకు ఇంకో అభిప్రాయం అన్నట్టుగా ఉంది. ఈ విషయంపై స్పష్టత లోపించడంతో రాష్ట్రంలో పార్టీ విస్తరణ పరిస్థితి ఏంటనేది ఇంకా డోలయామానంలోనే ఉందని చెప్పొచ్చు. పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఎవరికి అప్పగించాలనే చర్చ ఈ మధ్య జరిగింది. కులాలు, సామాజిక సమీకరణలు లెక్కలేశారని అనుకున్నారు. ఈ క్రమంలో కన్నా లక్ష్మీనారాయణ పేరు దాదాపు ఖరారు అయిపోయిందనే కథానాలు వచ్చాయి. అయితే, ప్రస్తుతం మాజీ కేంద్రమంత్రి పురందేశ్వరి పరిస్థితి ఏంటనే చర్చ పార్టీలో జరుగుతున్నట్టు సమాచారం. ఏపీలో పార్టీకి సంబంధించి ఏ కీలక బాధ్యతలు ఆమెకు అప్పగించాలనే తర్జనభర్జన ఇంకా కొనసాగుతున్నట్టు చెబుతున్నారు!
నిజానికి, ఎన్టీఆర్ వారసురాలిగా పురందేశ్వరిని పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే భాజపాకి మేలే. ఎన్టీఆర్ వారసత్వం అనే అంశం కొంతమేరకు ఆకర్షణీయంగా మారుతుంది. అయితే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భవిష్యత్తు అవసరాలు భాజపాకు కచ్చితంగా ఉంటాయి. కాబట్టి, టీడీపీని కూడా కలుపుకుని వెళ్లగలిగేవారే రాష్ట్ర అధ్యక్ష పదవిలో ఉండాలనేది భాజపా అభిప్రాయం. సో.. ఈ కారణంతో పురందేశ్వరి పేరును అధ్యక్ష రేసు నుంచి తప్పించారని అంటారు! సరే, ఇప్పుడు పురందేశ్వరికి ఇచ్చిన బాధ్యతలు ఏంటంటే.. అనంతపురం జిల్లాలో పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలపరచుకుంటూ రావడం! దాన్లో భాగంగానే ఆమె ఈ మధ్య తరచూ అక్కడ పర్యటిస్తున్నారనీ, అక్కడి ప్రాజెక్టులపై అధ్యయనం చేస్తున్నారని అంటున్నారు. భవిష్యత్తు ఈ ప్రాంతానికి సంబంధించిన పార్టీ బాధ్యతల్ని పురందేశ్వరికి ఇవ్వాలనే ఉద్దేశంతో భాజపా నాయకత్వం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
అయితే, పురందేశ్వరికి ఈ బాధ్యతల అప్పగింతపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయట! ఎన్టీఆర్ వారసురాలిగా రాష్ట్ర స్థాయి బాధ్యతలు ఆమెకి అప్పగిస్తే బాగుంటుందనీ, కేవలం ఒక ప్రాంతానికి పరిమితం చేయడం సరైన వ్యూహం కాదేమో అనే వ్యాఖ్యానాలు భాజపాలో వినిపిస్తున్నాయి. ఎవరికి ఎలాంటి బాధ్యతలు ఇవ్వాలనే అంశంపై భాజపా గందరగోళ పడుతూ ఉండటమే ఏపీలో అసలు సమస్య అనీ, భాజపా విస్తరణ గురించి ఆలోచిస్తున్న ప్రతీ సందర్భంలోనూ టీడీపీ ప్రస్థావన ఎందుకనీ, ఆ పార్టీతో స్నేహం అనే కోణం నుంచే నిర్ణయాలు ఉంటున్నాయంటూ కొంతమంది ఏపీ నేతలు ఆఫ్ ద రికార్డ్ వాపోతున్నారట! ఏపీలో పార్టీని సొంతంగా పైకి తీసుకురాగల సమర్థులైన నాయకులు భాజపాలో ఉన్నారనీ, సమస్యంతా వారికి సరైన బాధ్యతలు అప్పగించకపోవడమే అనే అభిప్రాయం వినిపిస్తోంది. మరి, అభిప్రాయాలు పైస్థాయి నేతల వరకూ చేరకుండా ఉంటాయా..?