జై ఎన్టీఆర్ కోసం హాలీవుడ్ మేకప్‌మెన్ వెన్స్ హర్ట్ వెల్‌ని తీసుకొచ్చారు గుర్తుంది కదా? ఎన్టీఆర్ మూడు పాత్రలు పోషిస్తున్నాడన్న టాక్ కూడా అప్పుడే బయటకు వచ్చింది. మూడు పాత్రలు, అందులోనూ హాలీవుడ్ నుంచి మేకప్‌మేన్ దిగుమతి… దాంతో.. జై లవకుశలో ఎన్టీఆర్ గెటప్పులు అదిరిపోయాయి, ఒక పాత్రకూ, మరో పాత్రకూ సంబంధం లేకుండా మేకప్ ఉండబోతోందని రకరకాలుగా ఊహించుకొన్నారు సినీ జనాలు. ఎన్టీఆర్, హర్ట్ వెల్ కలిసిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొట్టాయి. అంతేనా..?? హార్ట్ వెల్ ఇక్కడ వర్క్ షాపులు నిర్వహించాడని, ఎన్టీఆర్ కోసం రకరకాల స్కెచ్చులు గీశాడని, మేకప్ టెస్ట్‌లు జరిగాయని… పుంకాను పుంకానులుగా వార్తలొచ్చి పడిపోయాయి.
కానీ.. తెరపై ఎన్టీఆర్‌ని చూస్తే.. ఒక ఎన్టీఆర్‌కీ, మరో ఎన్టీఆర్‌కీ పెద్దగా తేడా కనిపించలేదు. ముగ్గురు మొనగాళ్లలో ఓ చిరంజీవి జుత్తు పెంచాడు, ఇంకో చిరంజీవి క్లీన్ షేవ్‌తో కనిపిస్తాడు, మరో చిరంజీవి పక్క పాపిట దువ్వుతాడు. జై లవకుశలో ముగ్గురు ఎన్టీఆర్లలోనూ అంతకంటే ఎక్కువ మార్కులు కనిపించవు. జై.. కళ్లు కాస్త చిన్నవి చేసుకొని మాట్లాడతాడు, లవ పద్ధతిగా, కుశ కాస్త హుషారుగా ఉంటాడు అంతే తేడా. ఈ మాత్రం దానికి హాలీవుడ్ మేకప్మెన్ని ఎందుకు తీసుకొచ్చినట్టో అర్థం కాదు. ఆయన వచ్చి, ఇక్కడ చేసిందేం లేదు. కేవలం ఈ సినిమాపై హైప్ తీసుకురావడానికి,హాలీవుడ్ నిపుణుల్ని మేం కూడా వాడుకొంటున్నాం అని చెప్పడానికి తప్ప.