ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా చాలా మంది మంత్రులు ఇప్పటికే విజయవాడకి తరలివచ్చేసారు. ఇంత వరకు హైదరాబాద్ లో పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ కార్యాలయాలు కూడా త్వరలోనే విజయవాడకి తరలించేందుకు ముమ్ముర ప్రయత్నాలు జరుగుతున్నాయి. కనుక ప్రతిపక్ష నేతలు, పార్టీలు కూడా విజయవాడ బాట పడుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ విజయవాడ నుండి తన కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇప్పుడు వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా విజయవాడ తరలివచ్చేందుకు సిద్దం అవుతున్నారని తాజా సమాచారం. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ లో తన లోటస్ పాండ్ నివాసంలో ఉన్న పార్టీ ప్రధాన కార్యాలయం నుండే రెండు రాష్ట్రాల వ్యవహారాలు చక్కబెడుతున్నారు. వైకాపా తెలంగాణా విభాగానికి అది చాలా అనుకూలంగా ఉన్నప్పటికీ ఆంద్రప్రదేశ్ రాజకీయ వ్యవహారాలు చూసుకొనేందుకు అది చాలా ఇబ్బందికరంగా ఉంది.
ఆంద్రప్రదేశ్ లో శ్రీకాకుళం నుండి అనంతపురం వరకు నిత్యం ఏదో ఒక జిల్లాలో పర్యటిస్తున్న జగన్, అది పూర్తికాగానే తిరిగి హైదరాబాద్ వెళ్లిపోతున్నారు. ఈ విధంగా హైదరాబాద్ నుండి రాకపోకలు సాగించవలసి రావడం చాలా ఇబ్బందికరంగా ఉండటంతో జనవరిలోగా జగన్ కూడా విజయవాడ తరలి వచ్చేయాలని భావిస్తున్నారు. అమరావతి తయారయ్యే వరకు విజయవాడలోనే ఆయన నివాసం, పార్టీ ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. అందుకోసం అవసరమయిన భవనాలను అద్దెకు తీసుకోవాలని జగన్ యోచిస్తున్నట్లు తాజా సమాచారం. ప్రభుత్వ శాఖలు, ఉద్యోగులు, రాజకీయ పార్టీలు అన్నీ క్రమంగా తరలివచ్చేస్తే ఇకపై విజయవాడ నగరం రాష్ట్ర రాజకీయ, పరిపాలనా వ్యవహారాలన్నిటికీ ప్రధాన కేంద్రంగా మారుతుంది.