దాదాపు తొమ్మిదేళ్ల కిందట సీనియర్ పాత్రికేయులు ఐ.వెంకట్రావ్ ఆధ్వర్యంలో మహాటీవీ మొదలవడం ఒక ఆకర్షణ. సంపాదకుడుగా వ్యాఖ్యాతగా ఆయనకున్న అనుభవం, విశ్వసనీయత, తెలుగుదేశం నాయకత్వంతో వున్న సత్సంబంధాల రీత్యా అది చాలా బాగా నడుస్తుందనే అంచనా వుండింది. మొదటి స్థానంలో వున్న టీవీ9 ఫేస్ గా వున్న రజనీకాంత్ సిఇవోగా వస్తున్నాడన్న వార్త మరో సంచలనమైంది. అయితే కారణాలేమైనా ఎవరైనా అది అనుకున్నంతగా విజయం సాధించలేదు. తర్వాత ఆయన వెనక్కు వెళ్లిపోయారు. తర్వాత కొంతకాలం ఓపిగ్గా పనిచేసిన రామారావు ఇప్పుడు ఎబిఎన్ ఆంధ్రజ్యోతితో వున్నారు. నెమ్మదిగా ఆర్థిక సమస్యలు జీతాల సంక్షోభం, సిబ్బంది నిష్క్రమణ మహాటీవీని మామూలు కన్నా సమస్యల్లోకి నెట్టాయి. ఐవిఆర్ పళ్లబిగువున నడిపిస్తుంటే అక్కడ బతకటానికి అలవాటు పడిన వారు అన్యధా అవకాశాలు లేని వారు మాత్రమే మిగిలిపోయారు. జాతీయ స్థాయిలో చక్రం తిప్పే సుజనా చౌదరి వంటి వ్యాపార వేత్త పెట్టుబడిపెట్టిన ఛానల్ ఇలా కావడం ఆశ్చర్యంగానే వున్నా వారు బాగు చేయడానికి చాలా ప్రయత్నాలు జరిపినా ఫలితం లేకపోయింది. చాలా పరిమితంగా నడుస్తున్నది.
ఆ ఫ్లాష్‌బ్యాక్ అలా వుంచితే ఇప్పుడు ఎవరో ఎన్ఆర్ఐలు మహాటీవీలో ప్రధాన వాటాలు తీసుకున్నారట.ఎవరనేది ఇంకా రహస్యం. సుజనా బృందం స్వయంగాఈ డీల్ పూర్తి చేసిందట. ముఖ్యమంత్రి చంద్రబాబుకు సన్నిహితుడుగా పేరు తెచ్చుకున్న జర్నలిస్టు వంశీకృష్ణ ఈ ప్రక్రియకు సూత్రధారిగా పనిచేస్తున్నారట. ఇకపైన మహాటీవీ ఎపికే ప్రధానంగా కేంద్రీకరిస్తుందని ఒక సమాచారం. అయితే ఇంకా ఏదీ ఖాయం కాలేదంటున్నారు. మిగిలిన కొద్దిమంది సిబ్బంది వారిలో ఒకరిద్దరు సీనియర్ల భవిష్యత్తు కూడా ఇంకా అస్పష్టమే. విజయవాడకు వెళతారా హైదరాబాదులోనే కొనసాగిస్తారా అన్నదానిపైనా భిన్న కథనాలున్నాయి. మొత్తానికి యాజమాన్యం చేతులు మారుతుంది. కొత్త పద్ధతులు వస్తాయి. ఇప్పటి వరకూ ఎబిఎన్కే తరహాలో పాలకపక్ష మొగ్గు మరో ఛానల్లోనూ బలంగా ప్రభావం చూపించవచ్చునని వూహిస్తున్నారు. అయితే ముందు అది నిలదొక్కుకోవాలి. అందుకూ పాలక పక్షం ఆశీస్సులు అండదండలు కావాలి. బహుశా దొరుకుతాయి.