తెలంగాణలో కీలక రాజకీయ శక్తిగా ఎదగాలనే ప్రయత్నంలో భాజపా ఉన్న సంగతి తెలిసిందే. ఈ దిశగా ఇతర పార్టీల నుంచి నాయకుల్ని ఆకర్షించే ప్రయత్నాల్లో ఉన్నట్టూ ఈ మధ్య కొన్ని కథనాలు వచ్చాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్ కూడా కాలికి బలపం కట్టుకుని ఈ మధ్య పర్యటనలు పెంచారు. సభలూ సమావేశాలు అధికం చేశారు. కేసీఆర్ సర్కారుపై విమర్శించే ప్రతీ అవకాశాన్నీ వాడుకుంటున్నారు! అయితే, ఇన్ని చేసినా వాస్తవం ఏంటంటే.. తెలంగాణలో నిర్ణయాత్మక రాజకీయ శక్తిగా భాజపా ఎదగాలంటే ఇంకా సమయం పడుతుందనీ, తెలంగాణ విషయంలో 2024 లక్ష్యంగా పనిచేయాలనే వ్యూహంతో జాతీయ నాయకత్వం ఉన్నట్టుగా కూడా ఈ మధ్య సంకేతాలు వెలువడ్దాయి! 2019 ఎన్నికల్లో తెలంగాణలో భాజపా అధికారంలోకి వచ్చేస్తుందనే ధీమా ఆ పార్టీ నేతలకూ అంతగా లేదనే కదా దీనర్థం. కానీ, బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని నొక్కి చెబుతున్నారు లక్ష్మణ్. అంతేకాదు, ఏ విధంగా అధికారం దక్కుతుందో కూడా ఓ సూపర్ లాజిక్ చెప్పారండోయ్.
పంచాయతీ నుంచి మొదలుకొని పార్లమెంటు వరకూ, మున్సిపాలిటీ నుంచి ముఖ్యమంత్రి వరకూ, గల్లీ నుంచి మొదలుకొని ఢిల్లీ వరకూ ఎక్కడ ఏ ఎన్నికలు జరిగినా గెలుస్తున్నది ఎవరంటే భారతీయ జనతా పార్టీ అని లక్ష్మణ్ చెప్పారు. తెరాస పాలనతో విసిగిపోయిన ప్రజలు భాజపావైపు చూస్తున్నారన్నారు. ఇతర పార్టీల నేతల చూపు కూడా తమవైపే ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిచి, మిగతా 18 రాష్ట్రాల్లో ఎలాంటి పాలన ఇస్తున్నామో, అలాంటి మెరుగైన పాలన ఇస్తామన్నారు. అయితే, కొంతమంది మేము ఎట్లా గెలుస్తారంటూ అడుగుతున్నారనీ, రాష్ట్రంలో మీరు ఎక్కడున్నారని తెరాస నాయకులు ప్రశ్నిస్తున్నారన్నారు. ఒక్కసారి వారు గమనించాల్సింది ఏంటంటే.. ఉత్తరప్రదేశ్ లో ఎట్లా గెలిచాం, ఎక్కడో నాలుగో స్థానం ఉన్న పార్టీ ఇవాళ్ల నంబర్ వన్ కి వచ్చిందన్నారు! అస్సాంలో ఎలా గెలిచాం, నలుగురు ఎమ్మెల్యేల నుంచి అధికారం వరకూ వచ్చామని లక్ష్మణ్ చెప్పారు. మణిపూర్, హర్యానాల్లో కూడా గెలిచామన్నారు. అలాంటప్పుడు, తెలంగాణలో ఎందుకు గెలవమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణ విషయంలో అద్భుతాలను లక్ష్మణ్ ఆశిస్తున్నట్టుగా ఉన్నారు! భాజపాకు పెద్దగా ఆదరణ లేని రాష్ట్రాల్లోనే అధికారంలోకి వచ్చినప్పుడు.. తెలంగాణలో ఎందుకు రాదనేది ఆయన లాజిక్. ఈ మాట పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వింటే చాలా సంతోషిస్తారేమో! ఎందుకంటే, తెలంగాణలో అధికారం కోసం రకరకాల వ్యూహరచనలతో ఆయన చాలా ఆలోచనలు చేస్తున్నారు. ఏం చేయాలా అని తలలు పట్టుకుంటున్నారు కదా. యూపీ, అస్సాం, మణిపూర్, హర్యానాల్లో గెలిచాం కాబట్టి.. తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తామని చెబితే ఎలా..? యూపీలో భాజపాకి ప్రజలు అధికారం కట్టబెట్టిన స్థానిక పరిస్థితులు వేరు. అస్సాంలో ఎన్నికల నాటి పరిస్థితులు ఇంకోలా ఉన్నాయి. ఇలా ఎక్కడి ప్రాథమ్యాల ప్రకారం అక్కడి ప్రజలు తీర్పు ఇచ్చారు. అంతేగానీ.. యూపీలో భాజపా గెలిచింది కదా అని హర్యానాలో ప్రజలు ఓట్లు వెయ్యరు కదా! ఇతర రాష్ట్రాల్లో అధికారంలో ఉంది కదా అని చెప్పి, తెలంగాణలో ప్రజలు భాజపాని ఎందుకు గెలిపిస్తారు..? తెరాసకు భాజపా ఏ విధంగా ప్రత్యామ్నాయమో ప్రజలకి వివరించాలి. అంతేతప్పు, ఇతర రాష్ట్రాల ఫలితాలతో ప్రజలకు ఏంటి సంబంధం..? ఇలాంటి ప్రభావం సరిపోతుందని లక్ష్మణ్ అనుకుంటున్నారేమో..!