తమిళనాట ఉవ్వెత్తున లేచి పడుతున్న సరికొత్త రాజకీయ కెరటం.. కమల్‌హాసన్. ఓ నటుడిగా కమల్ స్థాయేంటన్నది అందరికీ తెలుసు. ఓ రాజకీయ నాయకుడిగా ఆయనేంటి?? ఎలాంటి మార్పుని కోరుకొంటున్నారో, రాజకీయాలపై ఆయనకున్న అవగాహన ఎంతటిదో ఇప్పుడిప్పుడే జనాలకు అర్థం అవుతోంది. తమిళనాట కమల్ ఓ రాజకీయ ప్రత్యామ్నాయం కాగలడన్న భరోసా అయితే… రోజు రోజుకీ బలపడుతోంది. అయితే కమల్ కంటే ముందే సమరశంఖం పూరిస్తాడనుకొన్న రజనీకాంత్ ఇప్పటి వరకూ అత్తా పత్తా లేడు. ఇదిగో వస్తున్నాడు.. అదిగో వస్తున్నాడు అని చెప్పడం మినహా రజనీ ఎప్పుడూ స్వయంగా స్పందించలేదు. `ఆ దేవుడు ఆదిశిస్తే` అంటూ రొటీన్ డైలాగులైతే సినిమాటిక్ లెవిల్లో చాలా చెప్పాడు. జయలలిత మరణం తరవాత ఏర్పడిన గ్యాప్‌ని రజనీనే పూరించగలడన్నది అక్కడ రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. నిజానికి రజనీ రావాల్సిన తరుణం కూడా ఇదే. కానీ.. ఆయనేమో సినిమాలతో బిజీగా ఉన్నాడు. సరిగ్గా ఈ టైమ్‌లో అనుకోని కొత్త సినిమాలా… కమల్ వచ్చిపడిపోయాడు. ఎంచక్కా.. ఒక్కో ఇటుకా పేర్చుకొంటూ తనకంటూ ఓ అనుకూల వర్గాన్ని ఏర్పాటు చేసుకొంటున్నాడు. తప్పో ఒప్పో.. అవగాన ఉండో, లేకుండో రాజకీయ విమర్శలు చేయడానికి, పాలకుల్ని తూర్పారబట్టడానికీ వెనుకంజ వేయడం లేదు. కానీ రజనీ మాటేంటి..?? తన సినిమాల హడావుడిలో తానున్నాడు. ఎన్నికల ముందు తీరిగ్గా వద్దాం అనుకొంటే.. `ఇంతకాలం ఏమైపోయావు..? కష్టాల్లోఉన్నప్పుడు మేం గుర్తుకు రాలేదా??` అనే ప్రశ్న రజనీకి ఎదురయ్యే ప్రమాదం ఉంది. దానికి రజనీ సమాధానం చెబుతాడా??