ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ రాబడికి , అభివృద్ధి వేగంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రకటనలకూ పొంతన వుండటం లేదు. పైగా అనేక పాత కొత్త పథకాలకు నిధుల సమస్య కూడా ఏర్పడేట్టుంది. ఖజానా ఖాళీపై ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఇటీవల చెప్పిన లెక్కలు నిజం చేసేలా వున్నాయి వసూళ్లు. మొదటి ఆరు నెలల కాలంలో రావలసిన ఆదాయంలో 38 శాతం మాత్రమే వసూలైందట. 56,850 కోట్లకు గాను వచ్చింది 21,764 కోట్లు మాత్రమే. అందులోనూ వాణిజ్య పన్నులు 37 శాతమే వసూలైనాయి. జీఎస్టీ కారణంగా రాష్ట్రానికి రావలసిన ఆదాయం కేంద్రానికి పోతున్నది. అది ఎప్పుడు బదలాయించబడుతుందో తెలియదు. మిగిలిన ఆరు నెలల్లో 62 శాతం వసూలు కావడం ఎలాగూ సాధ్యం కాదు. కేంద్రం నుంచి వచ్చే సాయం కూడా విదిలింపుల చందంగానే వుంది. ప్రభుత్వం ఆశపెట్టుకున్న వనరులు కూడా తగ్గిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో ముందే మేల్కొని వాస్తవిక విధానాలు క్రియాశీల అమలు చేపట్టకపోతే అవసరాలను అందుకోలేమనే ఆందోళన అధికారుల్లో పెరుగుతున్నది. పథకాలకు కేంద్రం నుంచి నేరుగా మీరే వెంటపడి నిధులు తెచ్చుకోండని ముఖ్యమంత్రి విసుక్కోవడానికి కూడా ఇదే కారణమై వుంటుందని వూహిస్తున్నారు.