ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించాలంటే టీడీపీ దగ్గర ఉన్న ఆయుధం.. ‘అభివృద్ధి నిరోధక శక్తి’! రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని జగన్ అడ్డుకుంటున్నారనీ, ప్రజలకు మంచి చేస్తున్నా ఓర్వలేని ప్రతిపక్ష నేతను గతంలో తానెన్నడూ చూడలేదంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఎప్పుటికప్పుడు ఫైర్ అయిపోతుంటారు. వైకాపా మీదా జగన్ మీదా ఇదే ముద్ర వేసి, జగన్ పై ఈ కొత్త ఇమేజ్ ను ప్రజల్లోకి నెమ్మదిగా ఇంజెక్ట్ చేస్తున్నారు. దీనికి తోడు మరో కొత్త వాదనను తెరమీదికి తెచ్చారు కర్నూలు జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి. జగన్ ది రాయలసీమ కాదేమో అనే అనుమానం ఆయన వ్యక్తం చేయడం విశేషం! జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ కొత్త అనుమానాన్ని ఆయన తెరమీదికి తీసుకొచ్చారు.
ప్రతిపక్ష నేతది రాయలసీమేనా.. లేదా, తెలంగాణా ప్రాంతమా అనే అనుమానం కలుగుతోందని ఏరాసు విమర్శించారు. శ్రీశైలం నుంచి వెలుగోడుకు నీరు తెస్తుంటే దాన్ని చౌర్యం అని ఎలా అంటారనీ, అదే అభిప్రాయాన్ని తెలంగాణ ప్రాంతానికి వెళ్లే తన సొంత పత్రిక (సాక్షి)లో ఎలా రాస్తారంటూ ఆయన మండిపడ్డారు. రాయలసీమ ప్రజలకు సాగు, తాగునీటిని ఇస్తుంటే అడ్డుకునే ప్రయత్నం చేయడం దారుణం అన్నారు. అభివృద్ధి జరుగుతుంటే కేసులు వేస్తారనీ, జగన్ కు ఏమాత్రమూ సహనం లేదనీ, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే లక్షణాలు అస్సలు లేవంటూ ఏరాసు విమర్శలు గుప్పించేశారు. నిజానికి, జగన్ పై ఈ అనుమానానికి ఆజ్యం పోసింది ముఖ్యమంత్రే..! రాయలసీమకు నీళ్లు ఇస్తుంటే నీటి దొంగలని వారి పత్రికల్లో రాస్తున్నారని శుక్రవారం నాడు సచివాలయంలో సీఎం అన్నారు. పోతిరెడ్డిపాడు జలాలు తెస్తుంటే తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టేలా రాస్తున్నారనీ (సాక్షిలో), పులివెందుల కడపకు నీళ్లు ఇస్తుంటే భరించలేకపోతున్నారా, వీళ్లసలు మనుషులేనా అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దానికి కొనసాగింపే తాజాగా మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి వ్యాఖ్యలు అనుకోవచ్చు.
ఏతావాతా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే.. రాయలసీమ ప్రాంతంలో వైకాపాను అడ్డుకోవాలనే రాజకీయ వ్యూహం అంతర్లీనంగా అమలు జరుగుతోందని!. సీమ జిల్లాలో గట్టి పట్టు సాధిస్తే, వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు మరింత సునాయాసం అవుతుందనేది వారి ఆలోచనగా కనిపిస్తోంది! అందుకే, నంద్యాల ఉప ఎన్నిక ఫలితాల తరువాత ఈ ప్రాంతంపై కాస్త ఎక్కువ దృష్టి పెడుతున్నారనే అభిప్రాయం టీడీపీ వర్గాల నుంచే వినిపిస్తోంది. ఓపక్క జగన్ ను అభివృద్ధి నిరోధక శక్తి అని చిత్రించినా.. దాని ప్రభావం రాయలసీమ జిల్లాల్లో పెద్దగా ఉండకపోవచ్చు. ఎందుకంటే, అక్కడ వైకాపాకి ఉన్న ఆదరణ ఇతర ప్రాంతాలతో పోల్చితే కాస్త ఎక్కువే. అందుకే, ఇప్పుడు కొత్తగా జగన్ ను ‘తెలంగాణ అనుకూలవాది’ అనేలా విమర్శలు ప్రారంభిస్తున్నారని చెప్పొచ్చు. దీన్లోనే మరో కోణం… సీమ ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని కూడా ప్రజల్లోకి ఇంజెక్ట్ చేయడం..! నిన్న చంద్రబాబు అయినా, నేడు ఏరాసు అయినా ఇదే కోణంలో జగన్ పై విమర్శలు చేశారు. దీనిపై వైకాపా స్పందన ఎలా ఉంటుందో చూడాలి.