కరీం నగర్ జిల్లాలో రసమయి బాలకిషన్ ప్రాతినిధ్యం వహిస్తున్న మానకొండూరు నియోజకవర్గం గూడెం గ్రామంలో తమకు భూమి రాలేదని ఆత్మాహుతికి ప్రయత్నించిన దళిత యువకుడు శ్రీనివాస్ వారం రోజుల తర్వాత ప్రాణాలు కోల్పోయారు. తాండూరులో ఆత్మాహుతికి ప్రయత్నించిన టిఆర్ఎస్ కార్యకర్త అయూబ్ ఖాన్ కూడా కన్నుమూశారు. గతంలో తెలుగు360లో చెప్పుకున్నట్టు రైతులు పోలీసు అధికారులు ఇంకా అనేక మంది ఈ కాలంలో ఆత్మహత్యలకు ఒడిగట్టారు. ఉద్యమకాలంలో ఇలాటి ఘటనలు తీవ్ర సంచలనాలకు సంవాదాలకు దారి తీసేవి.కాని ఇప్పుడు ప్రభుత్వం వాటిని చాలా తేలిగ్గా తాత్కాలిక ఆవేశాలుగా తీసేస్తున్నది. శ్రీనివాస్ తన సమస్యపై రసమయి బాలకిషన్‌ను కలవడానికి మాట్లాడ్డానికి చాలా ప్రయత్నాలు చేసి ఆయన కార్యాలయం ముందే నిప్పటించుకున్నారు. తర్వాత ఆయన కూడా ఆస్పత్రిలో ఆ యువకుడిని సందర్శిస్తూనేవచ్చారు. టీవీ చర్చలో మాతో పాల్గొన్న కర్నె ప్రభాకర్ రసమయి తప్పిదం లేదని గట్టిగా సమర్థించారు. అయితే మొత్తంగా తెలంగాణలో దళితులకు మూడెకరాల భూమి పంపిణీ కార్యక్రమం ఎందుకు నత్తనడక నడుస్తున్నదనే ప్రశ్నకు పెద్ద సమాధానంలేదు. అంతకంటే కూడా తీవ్రమైంది ఇదంతా గ్రూపుతగాదాల ఫలితమని ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ బహిరంగంగా వ్యాఖ్యానించారు. టిఆర్ఎస్లో వర్గాలకే భూములు రాకపోతే ఇక ప్రతిపక్షాలకు ఎక్కడ వస్తాయనే విమర్శలకు ఇది దారి తీసింది. దీనిమీద లేవనెత్తిన సందేహాలకు కూడా సమాధానం రావడం లేదు. అన్నిటికంటే పెద్ద సందేహం ముఖ్యమంత్రి కెసిఆర్కుే గతంలోనే వచ్చిందట. పోలీసు దౌర్జన్యాలు, ఆత్మహత్యలు, వివాదాలు ఇన్ని సంఘటనలు ఎందుకు స్వంత జిల్లా కరీం నగర్లోనే జరుగుతున్నాయి? వీటి వెనక ఏదైనా కారణం వుందా? అని ఆరా తీశారు. ఇలా ఈ ప్రభుత్వ సర్వాధినేతకే సందేహం వచ్చిందంటే ఎవరిపైన? ఆ ప్రాంతానికి ప్రాతినిద్యం వహిస్తున్న కెటిఆర్‌ను వారసుడిని చేయకుండా కొందరు ఇవన్నీచేయిస్తున్నారని ఆయన సందేహాలున్నాయా? అందరూ అనుకునే హరీష్ రావుకు తోడు ఈటెల రాజేందర్పైనా రాజకీయ ఆరోపణలున్నాయా? అదే నిజమైతే పాలనా యంత్రాంగంపై పట్టు లేదనుకోవాలా? ఇలాటి ప్రశ్నలు లేవనెత్తినా టిఆర్ఎస్ నేతలు పైపై సమాధానాలతో సరిపెట్టి ప్రతిపక్షాలపై ఎదురుదాడి చేస్తున్నారు. కాని లోపలి లొసుగులు పాలనా లోపాలు కప్పిపుచ్చుకుంటే వారికే నష్టం.