వెనకటికో సామెత ఉంది.. ‘అరచేతిలో వైకుంఠం చూపించడం’ అనేది! ఇప్పుడు చెప్పుకోబోతున్న అంశానికీ దానికీ పొంతన కుదురుతుందో లేదో అనేది చివర్లో చూద్దాం. ముందైతే నేరుగా విషయానికి వచ్చేద్దాం! ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం చాలామంది రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు! రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తమ ఉదారతను చాటుకున్నారు. అయితే, ఇలా భూములు ఇచ్చిన రైతులకు సందర్భానుసారంగా బహుమానాలూ సన్మానాలూ వగైరావగైరాలు చేసి, వారికి తగు గౌరవం దక్కేలా చంద్రబాబు సర్కారు చేస్తోందనే చెప్పాలి! ఇప్పుడు మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. అదేంటంటే.. రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు సింగపూర్ ప్రయాణ యోగం కల్పించారు. ప్రభుత్వ ఖర్చులతోనే ఎంచక్కా సింగపూర్ వెళ్లి రావొచ్చు!
నిజమేనండీ.. ఇదే విషయమై ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత ప్రాధికార అభివృద్ధి సంస్థ (ఎ.పి.సి.ఆర్.డి.ఎ.) తాజాగా ఓ నిర్ణయం తీసుకుంది. ఈ పర్యటనకు వెళ్లేందుకు ఆసక్తి ఉన్న భూములిచ్చిన రైతుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. ఇంతకీ రైతుల్ని ఎందుకయ్యా ప్రభుత్వ ఖర్చులతో సింగపూర్ వరకూ తీసుకెళ్లడం అంటే.. అక్కడి అభివృద్ధిని పరిచయం చేస్తారట! సింగపూర్ ప్రభుత్వం చేపడుతున్న వివిధ ప్రాజెక్టుల దగ్గరకి రైతుల్ని తీసుకెళ్తారట. వాటి తీరుతెన్నుల గురించి రైతులకు అవగాహన కల్పిస్తారట. మొత్తంగా మూడు దశల్లో ఈ పర్యటన చేపట్టబోతున్నట్టు సమాచారం. అక్టోబర్ 22 నుంచి 26 వరకూ మొదటి బ్యాచ్ పర్యటన ఉంటుంది. రెండో బ్యాచ్ నవంబర్ 5న వెళ్తుంది, 9 వరకూ పర్యటిస్తుంది. మూడోది నవంబర్ 19 నుంచి 23 వరకూ పర్యటిస్తుంది. దీనికి సంబంధించిన విధి విధానాలు ఇప్పటికే ఖరారు అయినట్టు చెబుతున్నారు.
అభివృద్ధిలో సింగపూర్ మోడల్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఫాలో అవుతూ ఉంటారు. నవ్యాంధ్రను మరో సింగపూర్ చేయాలన్నది ఆయన లక్ష్యం! ఇప్పుడు రాజధానికి భూములు ఇచ్చిన రైతుల్ని సింగపూర్ కు తీసుకెళ్లడం కూడా మంచిదే, ఎవ్వరూ కాదనరు. కానీ, దాని వల్ల ప్రభుత్వం ఆశిస్తున్న ప్రయోజనం ఏంటి..? సింగపూర్ లో అభివృద్ధి పథకాలు చూపించి.. మన రాష్ట్రంలో కూడా ఇలానే జరుగుతాయని చెప్పడం ద్వారా అంతిమంగా ఏం సాధిస్తారు..? సింగపూర్ బాగానే ఉందిగానీ.. మన రాష్ట్రంలో ఇప్పటివరకూ జరిగిన అభివృద్ధి ఏంటనే ప్రశ్న ఆ రైతుల్లో కలిగే అవకాశం ఉంటుంది కదా! అయినా.. రాష్ట్రాన్ని ఏ మోడల్ తో అభివృద్ధి చేస్తున్నామనేది రాష్ట్ర నాయకుల స్థాయి టాపిక్. దాంతో సామాన్య ప్రజలకేం అవసరం? సింగపూరో జపానో లండనో.. మోడల్ ఏదైతే సామాన్యులకు ఎందుకు..? మనకు కావాల్సిన ప్రయోజనాలేంటీ, మనకు తీరాల్సిన అవసరాలు ప్రభుత్వపరంగా తీరుతున్నాయా లేదా, మన ముందు తరాల భవిష్యత్తుకు భరోసా ఉందా లేదా అనేదే సామాన్యుడి ఆలోచన పరిధి. ఆ భరోసాతోనే కదా ఓట్లేసింది. దాని కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ఏం చేస్తున్నారని చూస్తారు.
సింగపూర్ లో ఉన్నంత సేపూ మన రాజధాని కూడా ఇలానే తయారౌతుందని రైతులు నమ్ముతారు. మంచిదే.. తిరిగి ఇక్కడికి వచ్చాక, అలా ఎన్నాళ్లకి అవుతుందని ఆశగా ఎదురుచూస్తారు కదా! దానికి ప్రభుత్వం దగ్గర పక్కా సమాధానం ఉందా..? ఉంటే మంచిదే..! ముందేదో సామెతతో మొదలుపెట్టుకున్నాం.. ఇప్పుడు చూడండి, సరిపోతోందో లేదో!