ప్రతిపక్ష నేతల నోట రావలసిన ఈ మాటలు సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారంటే విశేషమే కదా! అది కూడా ఆయన ప్రతిష్మాత్మకంగా ప్రపంచ స్థాయిలో నిర్మించే రాజధాని అమరావతి గురించి! బుధవారంనాడు సిఆర్డిఎ వారాంతపు సమీక్షలో పాల్గొన్న ముఖ్యమంత్రి నిర్మాణ ప్రాజెక్టుల వేగం పెంచాలని ఆదేశించారట. ఇక ప్రణాళికల దశ నుంచి బయిటపడి ప్రత్యక్ష నిర్మాణం కావాలని చెప్పారు. ఇప్పటివరకూ అమరావతిపై వున్న విమర్శను ఈ విధంగా ఆయన అంగీకరించారన్నమాట. అయితే షరా మామూలుగా ప్రపంచంలోని తొలి అగ్రశ్రేణి నగరమొకటి నిర్మిస్తున్నామని అందరూ గుర్తుంచుకోవాలని కూడా ముక్తాయించారు. సంప్రదింపుల సంస్థలు కూడా హుషారు తెచ్చుకోవాలని, అధికారులు తమ దగ్గరున్న అత్యుత్తమ ప్రతిభావంతులను ఈ నిర్మాణ ప్రక్రియలో భాగస్వాములను చేయాలని సూచించారు. మొత్తంపైన ఎక్కడ ఎవరు మెరుపుమెరిపించినా మంచిదేనని ఆయన ఆశపడుతున్నారన్నది స్పష్టం. తమాషా ఏమంటే అధికారులకు ఇలా చెబుతున్న చంద్రబాబు బృందం అమరావతి నమూనాలు ఖరారు చేయడానికి అక్టోబరు చివరి వారంలో లండన్ వెళుతున్నది! దానికి పది రోజుల ముందు దర్శకుడు రాజమౌళి వెళ్లివస్తారు. అంటే అక్టోబర్ మొత్తం ప్రణాళికల పరిశీలనలకే కదా! ఇదిచాలదన్నట్టు 100 మంది రైతులను సింగపూర్‌కు పంపిస్తామంటున్నారు.ల్యాండ్ పూలింగ్‌లో తమకిచ్చిన ప్లాట్లను ఎలా లాభదాయకంగా వినియోగించుకోవాలో వారు అక్కడకు వెళ్లి చూసి రావాలట. ఏదో విధంగా రైతులను సంతోషపెట్టే తతంగం ఇది. ఇప్పటి వరకూ 75 శాతం మంది రైతులు తమ వాటాగా గుర్తించిన ప్టాట్లను రిజిస్టర్ చేసుకోవడానికి నిరాకరిస్తున్నారు. అనేక రెట్టు అధికలాభం వచ్చే వాణిజ్య ప్లాట్లను కేటాయిస్తామని చెప్పిన అధికారులు తమకు ఇస్తున్నదానికి ఏఏ అవకాశాలు వున్నాయో తెలిసేందుకోసం ఇన్ఫ్రా మ్యాప్‌తో సహా చూపిస్తేనే తీసుకుంటున్నామంటున్నారు రైతులు. ఈ శాఖకు సంబంధించిన ఒక ముఖ్య అధికారి కూడా నాతో ఈ విషయం ధృవీకరించారు. కనుక ముఖ్యమంత్రి ఏం చెప్పినా అక్కడ పడుతున్న అడుగులు మాత్రం చాలా తక్కువ.