నంద్యాల ఉప ఎన్నిక రావడంతో నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియను వాయిదా వేశారు సీఎం చంద్రబాబు నాయుడు. ఇప్పుడు మళ్లీ ఆ సందడి పార్లీలో మొదలు కాబోతోంది. ఖాళీ అయిన పోస్టులతోపాటు, ఎప్పట్నుంచో పెండింగ్ లో ఉన్నవాటిని కూడా ఒకేసారి భర్తీ చేయాలని టీడీపీ అధినాయకత్వం నిర్ణయించింది. పార్టీలో అసంతృప్తిగా ఉన్న మాజీ ఎమ్మెల్యేలు, ఎన్నాళ్లుగానో పదవుల కోసం ఎదురుచూస్తున్న నేతలు, ఆశించిన పదవులు దక్కలేదని కాస్త ముభావంగా ఉన్న నాయకులకు ఈ పందేరంలో ప్రాధాన్యత లభించబోతున్నట్టుగా సమాచారం. అసంతృప్తులకు ఈ పదవుల భర్తీలో ప్రాధాన్యతను కల్పించడం ద్వారా పార్టీని మరింత బలోపేతం చేయాలనేది అధినేత ఆలోచనగా తెలుస్తోంది. నామినేటెడ్ పోస్టుల భర్తీ కసరత్తు తుది దశకు చేరుకుందని చెబుతున్నారు.
టీటీడీ బోర్డుతో సహా ఛైర్మన్ పదవి, ఆర్టీసీ ఛైర్మన్ పదవి, డైరెక్టర్లు రీజినల్ ఛైర్మన్లు, 20 సూత్రాల పథకం అమలు కమిటీ ఛైర్మన్, ఢిల్లీలో ఏపీ అధికార ప్రతినిధి.. వంటి పదవులతోపాటు.. కాలుష్య నియంత్రణ మండలిని ఏర్పాటు చేయాల్సి ఉంది. అటవీ శాఖలో కూడా కొన్ని కార్పొరేషన్ పదవుల్ని భర్తీ చేయాల్సి ఉంది. వీటితోపాటు మరికొన్ని కార్పొరేషన్ల పదవులను కూడా ఒకేసారి భర్తీ చేయాలన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్టు సమాచారం. ఎక్కడెక్కడ ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయనే జాబితాను ఇప్పటికే ముఖ్యమంత్రి తెప్పించుకున్నారని చెబుతున్నారు. దీంతోపాటు ఏయే నాయకులకు కీలక పదవులు ఇవ్వాలనే అంశం మీద కూడా పార్టీ అధినాయకత్వంలో చర్చ జరుగుతున్నట్టు సమాచారం.
తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ పదవి కోసం మంత్రి యనమల వియ్యంకుడు, టీడీపీ నేత సుధాకర్ యాదవ్ పేరు ప్రముఖంగా వినిపిస్తూ ఉండటం విశేషం! మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డిని టీడీపీలోకి ఆహ్వానించి, వచ్చే ఎన్నికల్లో మైదుకూరు టిక్కెట్ ఇవ్వాలనే వ్యూహంలో భాగంగా ఈ నియామకం జరుగుతోందని చెబుతున్నారు. నంద్యాలలో భూమా నాగిరెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉంటూ, గడచిన ఉప ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కృషి చేసిన ఏవీ సుబ్బారెడ్డికి ఆర్టీసీ ఛైర్మన్ పదవి దక్కొచ్చని అంటున్నారు. వీరితోపాటు ధూళిపాల నరేంద్ర, యరపతినేని శ్రీనివాస్, శోభా హైమావతి, దివి శివరాం.. ఇలా కొంతమంది పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈ పదవుల కోసం ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్నవారిలో వీలైనంత మందికి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో టీడీపీ ఉన్నట్టు సమాచారం. ఎలాగూ మరో ఏడాదిన్నరలో ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి, పదవుల భర్తీతో నాయకులు నయా జోష్ తో పని చేస్తారన్నది టీడీపీ అంచనా. పదవి ఆశించీ, దక్కనివారిని కూడా ఎలాగోలా బుజ్జగించాల్సిన అవసరాన్ని టీడీపీ దృష్టిలో పెట్టుకుందనీ, అలాంటివారు ఎవరైనా ఉంటే పార్టీ తరఫున స్పష్టమైన హామీలు ఇచ్చి సంతృప్తిపరచే ప్రయత్నం చేస్తారనీ చెబుతున్నారు.