తెలుగు రాష్ట్రాల్లో పట్టు సాధించాలనే ఉద్దేశంతో భాజపా ఇప్పటికే ముమ్మరంగా ప్రయత్నాలు ఆరంభించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా కమలం నేతలు వివిధ కార్యక్రమాల పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఆంధ్రాలో ఈ హడావుడి పెద్దగా కనిపించడం లేదుగానీ.. తెలంగాణలో మాత్రం స్పష్టంగా ఉంది! కేసీఆర్ సర్కారు విధానాలపై విమర్శల వేడి పెంచారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారం దక్కించుకోవడమే తమ లక్ష్యం అని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఎప్పటికప్పుడు చెబుతూనే ఉన్నారు. అయితే, రాష్ట్రంలో అధికారం కంటే.. వీలైనన్ని లోక్ సభ స్థానాలు చేజిక్కుంచుకోవాలనే లక్ష్యంతో భాజపా జాతీయ నాయకత్వం కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్టుగా ఉంది. ఈ లక్ష్యంతోనే ప్రాంతాలవారీగా కొంతమంది నేతలకు పార్టీ బాధ్యతలు అప్పగించడం విశేషం.
ఈ మధ్య తెలంగాణ భాజపా వ్యవహారాల్లో రామ్ మాధవ్ క్రియాశీలంగా ఉంటున్న సంగతి తెలిసిందే. మెదక్, జహీరాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ లోక్ సభ స్థానాలపై ఆయన ప్రత్యేక దృష్టి పెట్టబోతున్నారు. చేవెళ్ల, వరంగల్, మల్కాజ్ గిరి, మహబూబ్ నగర్ స్థానాలకు సంబంధించిన బాధ్యతలు కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ ఇచ్చారు. భువనగిరి, నల్గొండ, నాగర్ కర్నూలు బాధ్యతల్ని బీహార్ రాష్ట్రమంత్రి మంగళ్ పాండేకి అప్పగించారు. హైదరాబాద్ లోక్ సభ స్థానం బాధ్యతల్ని కూడా త్వరలోనే కీలక నేతకు అప్పగిస్తారట! ఎందుకంటే, ఇక్కడ ఎమ్.ఐ.ఎమ్. బలంగా ఉంది కాబట్టి! నిజానికి, కేంద్రంలో మరోసారి అధికారంలోకి రావడమే ప్రస్తుతం భాజపా ముందున్న లక్ష్యం. ఆ వ్యూహంతోనే ముందుగా లోక్ సభ స్థానాలపై దృష్టి పెట్టిందని చెప్పొచ్చు. ఇక, తెలుగు రాష్ట్రాల్లో అధికారం దక్కించుకోవడం అంటారా.. అది రాబోయే ఎన్నికల లక్ష్యంగా భాజపా పెట్టుకోదని అనిపిస్తోంది.
తాజా ఏర్పాట్లను బట్టీ చూస్తుంటే.. తెలంగాణలో భాజపా ఎవ్వరితోనూ పొత్తు ఉండదనేది మరోసారి స్పష్టమౌతోందనే చెప్పొచ్చు. ఆంధ్రాతో తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉన్నా.. తెలంగాణలో మాత్రం అలాంటిది ఉండదనే సంకేతాలే వ్యక్తమౌతున్నాయి. రాష్ట్రంలో కూడా తమదే అధికారం అని రాష్ట్ర స్థాయి కమలనాథులు ప్రచారం చేస్తున్నప్పటికీ… జాతీయ స్థాయిలో భాజపా కన్నంతా ఎంపీ సీట్లపైనే ఉంటోందని స్పష్టమౌతోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అధికారం కోసం భాజపా ప్రత్యేక వ్యూహాలు ఎన్ని రచించినా, ఇప్పట్లో వర్కౌట్ కాదనే స్పష్టత వారికి ఉండే ఉంటుంది కదా! పైగా, రాష్ట్రాల్లో అధికారం దక్కించుకోవాలంటే.. ఆ పని ఎప్పుడైనా చేసుకోవచ్చు! అలాంటి అవకాశాలను సృష్టించుకుని మరీ తమకు అనుకూలంగా మార్చుకునే అనుభవం భాజపాకి కావాల్సినంత ఉంది. అరుణాచల్ ప్రదేశ్ నుంచీ తమిళనాడు వరకూ అలాంటి రాజకీయాలు చాలానే చూస్తున్నాం! సో.. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి భాజపా ప్రస్తుత లక్ష్యమైతే పార్లమెంటు స్థానాలే అనేది క్లియర్. తెలంగాణలో టీడీపీతో పొత్తు ఉండదనేదీ దాదాపు తేలిపోయినట్టే!