మాజీ మంత్రి తెలుగుదేశం ఎమ్మెల్యే రావెల కిశోర్ బాబు మాటలూ చేతలూ ఎప్పుడూ వివాదాస్పదంగా వుంటాయి. మంత్రిగా వున్నంత కాలం ప్రభుత్వాన్ని కొమ్ముకాసిన రావెల ఆ పదవి పోయాక విమర్శకుడుగా మారారు. అందులోనూ మాదిగల తరపున మాట్లాడే ప్రతినిధిగా ముందుకు రావడానికి ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబుపై విమర్శలు కురిపించే ఎంఆర్పిఎస్ అద్యక్షుడు మంద కృష్ణమాదిగతో కలసి వర్గీకరణ గురించి మాట్లాడుతున్నారు. ఇవన్నీ తప్పేమీ కావు గాని గతంలో ప్రభుత్వంలో వున్నప్పుడు ఆయనే కృష్ణమీద విరుచుకుపడుతుండేవారు. సరే అదంతా గతం. ఇటీవల నేను గుంటూరు వెళితే పక్కనే పత్తిపాడులో గుర్రం జాషవా వర్థంతి సందర్భంగా ఆయన విగ్రహావిష్కరణ తలపెట్టారు కిశోర్‌బాబు. ఈ ఉత్సవానికి మందకృష్ణమాదిగ ముఖ్యఅతిధి. ఆయనకు ఆతిధ్యం ఇవ్బడంపై గతంలోనే టిడిపిలో దుమారం రేగి, ముఖ్యమంత్రి చంద్రబాబు వివరణివ్వాల్సివచ్చింది. అయినా రావెల విధానం మార్చుకోకపోగా మళ్లీ పిలిపించారంటే వెనక రాజకీయం వుండకుండా పోదు. అంతేగాక పత్తిపాడులో ఎస్సి రిజర్వేషన్ల వర్గీకరణ పూర్తి చేయాలంటూ గట్టిగా మాట్టాడారు. ఇదంతా చంద్రబాబును ఇరుకునపెడుతుందనేది వ్యతిరేకుల ఆరోపణ. ఈ క్రమంలో చంద్రబాబుపై కిశోర్‌బాబు నోరు జారాడన్నట్టు మరో టిడిపిలో మరో దళిత నేత, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ వర్ల రామయ్య విరుచుకుపడ్డారు.
చంద్రబాబును ఏదయినా అంటే సహించబోమన్నారు. ఆయనను అంతగా విమర్శించే కృష్ణమాదిగ వెంటపోవడాన్ని ఆక్షేపించారు. మొత్తంమీద చినికి చినికి గాలివానగా రావెల కిశోర్‌బాబు వ్యవహరం వివాదాస్పదం చేయడం ఖాయమని దీన్నిబట్టి తెలుస్తుంది.ఇప్పటికే జూపూడి ప్రభాకరరావు, కారెం శివాజీ వంటివారు రావెలమీద విమర్శలు చేయకపోలేదు. కాని పత్తిపాడు ఘటన తర్వాత వర్లరామయ్య దాడి ఇంకా తీవ్రంగా వుంది. అంటే ఆయనపై ఏదో చర్యకు రంగం సిద్ధమవుతుండొచ్చు. స్వంత పదవి కోసమే గాక దళితుల కోసం రావెల మాట్లాడగలిగితే కొంత మద్దతు రావచ్చు కూడా. అయితే ా ప్రస్తుతానికి ఆయన రాజీ పడే అవకాశాలే ఎక్కువ.