ఈ దసరాకి భారీ అంచనాల మధ్య విడుదలైంది మహేష్ బాబు `స్పైడర్`. తొలి షో నుంచే డివైడ్ టాక్‌తో నడుస్తోంది. స్వయంగా మహేష్‌బాబు అభిమానులే ఈ సినిమా చూసి పెదవి విరుస్తున్నారు. ఈ డివైడ్ టాక్ పట్ల నిర్మాతల్లో ఒకరైన ఠాగూర్ మధు స్పందించారు. కొద్దిసేపటి క్రితం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారాయన. డివైడ్ టాక్ వచ్చిన మాట నిజమే అని.. అయితే మెల్లమెల్లగా అంతా సర్దుకొందని చెప్పుకొచ్చారు. తొలి రోజే రూ.50 కోట్లు దాటిన వసూళ్లు రెండో రోజూ నిలకడగా కనిపించాయని, రెండు రోజులకు కలిపి రూ.72 కోట్లు సాధించామని లెక్కలు చెప్పారాయన. తమిళనాట కూడా మంచి స్పందన వస్తోందని, రజనీకాంత్ తమ సినిమాని మెచ్చుకోవడం ఓ గొప్ప అవార్డుగా భావిస్తున్నామన్నారు. ”ఈ సినిమాపై అంచనాలు బాగా పెరిగిపోయాయి. అందుకే… తొలిరోజు డివైడ్ టాక్ వినిపించింది. మురుగదాస్ ఎప్పుడూ కమర్షియల్ కొలతలకు లొంగిపోలేదు. ఫైటు, పాటలతో సినిమా చుట్టేయరు. బలమైన పాయింట్ చెప్పాలన్న ప్రయత్నం చేస్తారు. ఈ సినిమాలోనూ అది కనిపించింది. అది అర్థం అవ్వడానికి కాస్త టైమ్ పడుతుంద”న్నారు ఠాగూర్ మధు.
ఈ సినిమాలో తమిళ వాసనలు ఎక్కువ కొడుతున్నాయన్నది మరో విమర్శ. దానిపై కూడా ఆయన స్పందించారు. ”ప్రతీ పాత్రనీ చాలా జాగ్రత్తగా తీర్చిదిద్దుతారు. కథకు ఎవరు అవసరమో వాళ్లనే ఎంచుకొంటారు. తెరపై కొన్ని కొత్త పాత్రలు కనిపించాయి. దాంతో తమిళ నేటివిటీ ఎక్కువ ఉందనిపించి ఉండొచ్చు. కానీ తెలుగు, తమిళ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టే ఈ సినిమాని డిజైన్ చేశాం” అన్నారాయన.