ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న అనేక అభివృద్ధి కార్యక్రమాలకు భూసేకరణకు పూనుకోవలసి వస్తోంది. రాజధాని కోసం మొదలుపెట్టిన భూసేకరణ కార్యక్రమం బందరు పోర్టు, గన్నవరం విమానాశ్రయ విస్తరణ, భోగాపురం వద్ద విమానాశ్రయ నిర్మాణం వంటి అనేక పనులకు తప్పనిసరిగా భూసేకరణ చేయవలసి వస్తోంది. అయితే ఇన్ని వీల ఎకరాల భూసేకరణలో ఏ ఒక్క రాజకీయ నాయకుడు, ప్రముఖుడిది ఒక్క సెంటు భూమి కూడా పోలేదు. అదే చాలా విచిత్రంగా ఉంది. అన్ని చోట్ల కేవలం రైతులే నష్టపోతున్నారు. మంచిసారవంతమయిన పంట పొలాల మీదనే సిమెంట్ కట్టడాలను నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. అందుకే అందరూ భూసేకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై ఉన్న మక్కువ వ్యవసాయంపై లేదనే సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఆయనకీ నగరాలు, పట్టణాలపై ఉన్న ఆసక్తి పల్లెలపై లేదనే చేదు నిజం అందరికీ తెలుసు. అందుకే ఆయనపై రైతు-వ్యవసాయ వ్యతిరేకి ముద్ర పడింది. పదేళ్ళపాటు ప్రతిపక్షంలో కూర్చొన్నప్పుడు ఆయన తన మైండ్ సెట్ చాలా మార్చుకొన్నట్లు చెప్పుకొనేవారు. కానీ రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరుగుతున్న భూసేకరణ కార్యక్రమాలని గమనిస్తే ఆయనేమీ మారదలేదని స్పష్టం అవుతోంది.
అభివృద్ధి కార్యక్రమాలకు భూసేకరణ చేయక తప్పదు. కానీ అందుకు అన్నదాతలను బలి చేయడమే తప్పు. ప్రభుత్వం వారికి ఎన్ని హామీలయినా గుప్పించవచ్చును. కానీ వాటిలో ఆచరణకు నోచుకోనేవి ఏ కొన్నో ఉంటాయి. రాష్ట్రాభివృద్ధి కోసం రాజకీయ నాయకులు ఎటువంటి త్యాగాలు చేయకుండా ఎప్పుడూ ప్రజలను, రైతులను త్యాగాలు చేయమని కోరడం వలననే ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్షాలు చేసే అందోళనలకు మద్దతు ఇస్తుంటారు.
మంచి కార్యదక్షత, నేర్పు గల చంద్రబాబు నాయుడు ఈ ఐదేళ్ళలో రాష్ట్రాన్ని మళ్ళీ అన్ని విధాల అభివృద్ధి చేస్తారని రాష్ట్ర ప్రజలు ఆయనపై చాలా ఆశలు పెట్టుకొన్న మాట వాస్తవం. ఆ విషయం ఆయనకీ బాగానే తెలుసు. అందుకే ఆయన మిగిలిన ఈ మూడున్నరేళ్ళలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపించి ప్రజల మనసులు గెలుచుకొని వచ్చే ఎన్నికలలో కూడా విజయం సాధించి మళ్ళీ అధికారంలోకి రావాలని తహతహలాడుతున్నారు. కానీ ఆ అభివృద్ధి కోసం అన్నదాతలను రోడ్డున పడేస్తే ఆయనకున్న రైతు వ్యతిరేకి ముద్ర శాశ్వితం అయిపోవచ్చును.
అదే కారణంగా ఆయన వచ్చే ఎన్నికలలో పరాజయం పాలవ వచ్చును. ఇప్పుడు రైతుల తరపున నిలబడి గట్టిగా పోరాడుతున్న ప్రతిపక్షాలు అదే కారణంగా వారి ఆదరణపొంది అధికారంలోకి రావచ్చును. ఒకవేళ ప్రభుత్వం రైతుల నుండి బలవంతంగా భూములు స్వాధీనం చేసుకొన్న తరువాత ఏవయినా కారణాల వలన వచ్చే ఎన్నికలలోగా అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చెప్పట్టకపోయినా పూర్తి చేయలేకపోయినా అప్పుడు పట్టాన, నగర ప్రజలు కూడా తెదేపాకి వ్యతిరేకంగా ఓటు వేసే ప్రమాదం పొంచి ఉంది. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు, వాటి బలాబలాలు ఏవిధంగా ఉంటాయో ఎవరూ ఊహించలేరు. కనుక తెదేపా ప్రభుత్వం భూసేకరణ విషయంలో పునరాలోచన చేసి అడుగు ముందుకు వేయడమే అన్ని విధాల మంచిది. లేకుంటే దానికి తెదేపాయే భారీ మూల్యం చెల్లించవలసి ఉంటుందనే విషయం గుర్తుంచుకోవాలి.