దాదాపు మూడున్నరేళ్లుగా గవర్నర్ పదవి కోసం టీ టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహలు ఎదురుచూశారు. రేపోమాపో ఆయన గవర్నర్ కావడం ఖాయం అనుకున్నారు. టీడీపీ వర్గాలు కూడా ఆయన్ని ముద్దుగా గవర్నర్ అంటూనే పిలిచేవి. కానీ, ఈ మధ్య కేంద్రం కొన్ని రాష్ట్రాలకు గవర్నర్లను నియమించిన సంగతి తెలిసిందే. ఆ జాబితాలో మోత్కుపల్లి లేరు. దీంతో మొత్తం సీన్ రివర్స్ అయింది. అయితే, త్వరలో మరో రెండు రాష్ట్రాలకు కొత్తగా గవర్నర్లను నియమించే అవకాశం ఉందంటూ తాజాగా వినిపిస్తోంది. ఈ జాబితాలోనైనా మోత్కుపల్లికి ప్రాధాన్యత లభిస్తుందా అనే చర్చ జరుగుతూనే ఉంది. ఇదిలా ఉంటే.. టీ టీడీపీ వర్గాలో మరో చర్చ ప్రారంభమైందని సమాచారం. ఇన్నాళ్లూ గవర్నర్ గిరీ కోసం ఎదురుచూసిన మోత్కుపల్లి.. ఇకపై క్రియాశీల రాజకీయాల మీద దృష్టి పెట్టినా అంతగా రాణిస్తారా అనే అనుమానాలు వారి నుంచే వ్యక్తం అవుతూ ఉండటం విశేషం.
అత్యున్నత పదవిలోకి వెళ్తానన్న ఉద్దేశంతో ఆయన పార్టీ తరఫున పెద్దగా మాట్లాడటం మానుకున్నారు. పార్టీ చేస్తున్న పోరాటాలు, నిరసనలు వంటి కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటూ వచ్చారు. దీంతో సహజంగానే ఆయనపై టీడీపీ నేతల్లో కొంత అసంతృప్తి ఏర్పడింది. అంతేకాదు, తెలంగాణ టీడీపీలో కీలకంగా ఉంటున్న ఒకరిద్దరు ప్రముఖ నేతలతో ఆయన కలిసి పనిచేసే పరిస్థితి లేదనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కేవలం ఆంధ్రా రాజకీయాలకు పరిమితం కావడంతో, తెలంగాణలోకి నాయకత్వం తీరుపై మోత్కుపల్లి మొదట్నుంచీ సంతృప్తిగా లేరనీ, ఎలాగూ గవర్నర్ పోస్టు వస్తుంది కాబట్టి, రాష్ట్ర రాజకీయాల గురించి తానెందుకు పట్టించుకోవాలనే ఉద్దేశంతో ఇన్నాళ్లూ మౌనంగా ఉంటూ వచ్చారని సమాచారం! అయితే, ఇప్పుడు మరోసారి క్షేత్రస్థాయికి వెళ్లక తప్పదు. తన మద్దతుదారులను, కేడర్ ను, అలాగే రాష్ట్రంలోని పార్టీకి చెందిన ప్రముఖ నేతలనూ కలుపుకుంటూ ముందుకు సాగాల్సిన పరిస్థితి.
లేదంటే, ఆయనకు రాజకీయ భవిష్యత్తు కనిపించడం లేదు. సమస్య అంతా ఇక్కడే ఉందనీ… పార్టీలో కొనసాగాలంటే కొంతమంది నాయకులతో ఆయన సర్దుబాటు చేసుకోవాల్సిన పరిస్థితి ఉందనీ అంటున్నారు. తెలంగాణకు చెందిన కొందరు టీడీపీ నేతలపై ఆ మధ్య చంద్రబాబుకు కూడా మోత్కుపల్లి ఫిర్యాదు చేశారట. పార్టీ సెటప్ సరిగా లేదనీ, రాష్ట్రంలో ఇలాగైతే పార్టీ ఎలా ఎదుగుతుందనే చర్చ చంద్రబాబు సమక్షంలోనే ఆయన లేవనెత్తారట! దీంతో అక్కడున్న ఇతర టీడీపీ నేతలు మోత్కుపల్లిపై కాస్త గరంగరం అయ్యారట. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో సొంత పార్టీ నేతల నుంచే మోత్కుపల్లి పునరాగమనానికి పూర్తిస్థాయి సహకారం లభిస్తుందా అనేది చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి, మోత్కుపల్లి వ్యవహారం టీ టీడీపీలో కొత్త రాజకీయాలకు తెర తీసే విధంగా మారుతోందని అనిపిస్తోంది.