చిరంజీవి 151వ సినిమా ‘సైరా నరసింహారెడ్డి’పై బోలెడన్ని రూమర్లు. సైరా మొదలై నెల దాటేసినా.. ఇంకా పట్టాలెక్కకపోవడంతో గాసిప్ రాయుళ్లు రెచ్చిపోతున్నారు. ఈ సినిమా నుంచి రెహమాన్ తప్పుకొన్నాడని, ఇప్పుడు కెమెరామెన్ కూడా వదిలేసి వెళ్లిపోతున్నాడని పుంకాను పుంకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి. రెహమాన్ స్థానంలో తమన్ వచ్చేశాడని చెప్పుకొంటున్నారు. ‘సైరా’ టీమ్ కోసం టెక్నీషియన్ల లిస్టు రాస్తున్నప్పుడు రాసిన మొదటి పేరు.. సంగీత దర్శకుడు రెహమాన్! ఈ విషయంలో ఎలాంటి అనుమానాలకూ తావులేదని చిత్రబృందం స్పష్టం చేసింది. ఈ సినిమాకి ఇప్పటికీ రెహమానే సంగీత దర్శకుడని, ఆయన ప్రస్తుతం పాటల్ని కంపోజ్ చేసే పనిలో ఉన్నారని, ‘సైరా’ టీమ్ లోని ఓ సభ్యుడు తెలుగు 360.కామ్‌కి చెప్పారు.
అయితే కెమెరామెన్ రవి వర్మన్ కాస్త డౌట్ అని తెలుస్తోంది. ఆగస్టు చివరి వారంలోనే సెట్స్‌పైకి వెళ్లాల్సిన ప్రాజెక్ట్ ఇది. రవి వర్మన్ నుంచి కాల్షీట్లు కూడా అలానే తీసుకొన్నారు. అయితే.. షూటింగ్లో జాప్యం జరగడంతో కెమెరామెన్ కాల్షీట్లు క్లాష్ అయ్యే ప్రమాదం ఏర్పడింది. ఒకవేళ రవివర్మన్కి వేరే ప్రాజెక్టు ఉంటే.. ఆయన టీమ్ నుంచి తప్పుకొనే ఛాన్సులున్నాయని తెలుస్తోంది. రవి వర్మన్ స్థానంలో మనోజ్ పరమహంసని ఈ చిత్రం కోసం ఎంచుకొనే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. సురేందర్ రెడ్డి తెరకెక్కించిన రేసుగుర్రంకి మనోజ్ పరమహంస ఛాయాగ్రహణ బాధ్యతలు స్వీకరించారు. దీపావళి తరవాత సైరా సెట్స్‌పైకి వెళ్లనుంది.