ఆంధ్రప్రదేశ్ విషయంలో భాజపా ఇంకా ఒక స్పష్టతకు రాలేకపోతోందా..? ముఖ్యంగా, ఎన్నికల ముందు ఆ పార్టీ అధ్యక్ష పదవిని ఎవరికి కట్టబెట్టాలనే లెక్కలపై ఇప్పటికీ నిర్ణయం తీసుకోలేని స్థితిలోనే ఉన్నారా..? ఎవరికిస్తే ఏం జరుగుతుందో అనేది తేల్చుకోలేకపోతున్నారా..? ఇప్పటికే రేసులో ఉన్నారంటూ తెర మీదకి వచ్చిన ఆ ముగ్గురిలో ఎవరిని ఎంపిక చేస్తే ఏమౌతుందో అనే అంచనాకి రాలేకపోతున్నారా..? ఇలాంటి అన్ని ప్రశ్నలకూ అవుననే సమాధానం చెప్పుకోవాలి. వచ్చే ఎన్నికల నాటికి ఏపీలో పట్టు సాధించాలనేది భాజపా లక్ష్యం. నేతలంతా సిద్ధంగా ఉండాలంటూ జాతీయ నాయకత్వం నుంచి ఎప్పటికప్పుడు ఇలాంటి పిలుపులైతే వస్తున్నాయి! కానీ, అధ్యక్ష పదవి విషయంలో మాత్రం ఇంకా డైలమా కొనసాగుతోందని తెలుస్తోంది.
ఇప్పటివరకూ ఏపీ బాధ్యతల్ని ఎంపీ కంభంపాటి హరిబాబు చూసుకున్నారు. గతంలో కూడా పార్టీ పగ్గాలు హరిబాబు నుంచి వేరే మారుస్తారనే చర్చ జరిగినా.. కంభంపాటి అధ్యక్ష పదవి అలా కొనసాగుతూనే వచ్చింది. ఈ మధ్య కేంద్రమంత్రి వర్గ విస్తరణలో హరిబాబుకు పదవి గ్యారంటీ అనుకున్నారు. ఆ సందర్భంలో ఆయన్ని ఢిల్లీకి కూడా పిలిచేశారు. కానీ, ఆయనకి నిరాశే మిగిలింది. ఈ నేపథ్యంలో, ఇప్పుడు హరిబాబు నుంచి రాష్ట్ర అధ్యక్ష పదవిని తీసేస్తే ఆయన స్పందన ఎలా మారుతుందో అనే చర్చ కూడా కొంతమంది భాజపా నేతల్లో ఉన్నట్టు సమాచారం! ఎలాగూ కేంద్రమంత్రి పదవి దక్కలేదు, కనీసం ఉన్న పార్టీ అధ్యక్ష పదవిని కూడా మార్చేస్తే ఆయన అసంతృప్తి చెందే అవకాశం ఉందనేది కొంతమంది విశ్లేషణ!
భాజపా అధ్యక్ష పదవి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంటి పదవులకు ఆర్.ఎస్.ఎస్. నేపథ్యం ఉన్న వారినే ఎంపిక చేయడం భాజపాలో ఓ సంప్రదాయంగా ఉంది! తెలంగాణ విషయంలో కూడా అదే సూత్రాన్ని పాటించారు. కానీ, ఏపీ విషయానికి వచ్చేసరికి దాన్ని సడలించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నిజానికి, ఈ సంప్రదాయన్ని భాజపా ఎప్పుడో పక్కన పెట్టేసిందనే చెప్పాలి! ప్రస్తుతం రేసులో ఉన్న పురంధేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణలకు ఆ నేపథ్యం లేదు కదా. సోము వీర్రాజు పేరు ఈ రేసులో భాగంగా కొన్నాళ్లు వినిపించింది. కానీ, అవసరమైతే అన్ని పార్టీలతో సయోధ్యగా ఉండగలిగే వారికే పదవి ఇవ్వాలనే లెక్కలు వేశారు కదా! ఆ లెక్కల్లో సోము వీర్రాజు పేరు పక్కకు వెళ్లిపోయింది. ఇక, మిగిలిన ఈ ఇద్దరిలో ఎవరికి ఇవ్వాలనేది కూడా ఇంకా నిర్ణయానికి రానట్టు తెలుస్తోంది. కాసేపు ఆర్.ఎస్.ఎస్. నేపథ్యం గురించి మాట్లాడుతున్నారు, ఇంకొన్నాళ్లు ఎంపీ హరిబాబు గురించి చర్చిస్తూ కాలాన్ని వెళ్లబుచ్చుతున్నట్టు చెబుతున్నారు! ఏపీ పార్టీ అధ్యక్ష పదవి విషయంలో స్పష్టతకు మరికాస్త సమయం తప్పదనే అనిపిస్తోంది.