స్టార్ సినిమా వచ్చిందంటే గుడ్డిగా జనం థియేటర్ల వైపుకు పరిగెట్టే రోజులు పోయాయి. ఎంతటి స్టార్ అయినా, ఎన్ని కోట్లు ధారబోసినా, ఎన్ని హంగులు రుద్దినా – తమకు నచ్చితేనే జనం చూస్తారు. ఈ విషయం ‘స్పైడర్’తో తెలిసిపోయింది. ఒక్కసారి డివైడ్ టాక్ వచ్చిందంటే – దాన్ని హిట్గా మార్చుకోవడం అసాధ్యమన్న సంగతి తేటతెల్లమైపోయింది. ‘స్పైడర్’ చిత్రసీమకు చాలా పాఠాలు నేర్పించి వెళ్లింది. ఒక విధంగా రాబోయే పెద్ద సినిమాలకు ‘స్పైడర్’ రిజల్ట్ ఓ ముందస్తు హెచ్చరిక.
‘స్పైడర్’ టైటిల్ విషయంలో చిత్రబృందం నాచ్చుడు ధోరణి అభిమానుల్ని సైతం విసిగించింది. టైటిల్ ఏంటో చెప్పడానికి చిత్రబృందానికి ఏడాది పట్టింది. టీజర్, ఫస్ట్ లుక్ల విషయంలోనూ ఎదురుచూపులు తప్పలేదు. సినిమా ఎలా ఉండబోతోందన్న అవగాహన అటు అభిమానులకు గానీ, ఇటు సామాన్య ప్రేక్షకుడికి గానీ లేకుండా పోయింది. దాంతో ఎన్నో ఊహించేసుకొని థియేటర్లలోకి అడుగుపెట్టారు. జేమ్స్ బాండ్ స్టైల్లో, హాలీవుడ్ స్థాయిలో ఈ సినిమా ఉంటుందనుకొంటే – తమిళ వాసనలతో గుప్పుమంది. టైటిల్, టీజర్ విషయాల్లో చేసిన ఆలస్యం, సినిమాపై చిత్రబృందం ఎలాంటి అవగాహన కల్పించకపోవడం మైనస్సులుగా మారాయి.
సరిగ్గా ఇలాంటి తప్పులే చేస్తోంది పవన్ బృందం. పవన్ – త్రివిక్రమ్ కాంబోలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటి వరకూ చిత్రబృందం నుంచి ఎలాంటి అప్డేట్ బయటకు రాలేదు. టైటిల్ విషయంలోనూ బోల్డంత గందరగోళం నెలకొంది. దాదాపు అరడజను టైటిళ్లు, లోగోలతో సహా బయటకు వచ్చాయి. చివరికి ‘అజ్ఞాతవాసి’ ఫిక్సయిందనుకొన్నారు. అయితే.. ఇంకా చిత్రబృందం టైటిల్ ఏంటన్నది అధికారికంగా ప్రకటించలేదు. టీజర్, ఫస్ట్ లుక్ లాంటి ఊసేలేదు. ఈ సినిమా మొదలయ్యాక చాలా పండగలు వచ్చాయి, వెళ్లాయి.కానీ.. పవన్ నుంచి ఎలాంటి గిఫ్టులూ రాలేదు. సినిమా జోనర్ ఏంటి? కథానాయకుడు ఏం చేస్తుంటాడు?? అనే విషయాలపై ప్రేక్షకులకు ముందే ఓ హింట్ ఇచ్చేయడం బెటర్. లేదంటే ఏవేవో కథలు అల్లేసుకొంటారు. ఎన్నో అంచనాలు పెంచుకొంటారు. వాటికి మ్యాచ్ కాకపోతే… మొదటికే మోసం వస్తుంది. ఇకనైనా పవన్ బృందం కాస్త తేరుకొని – అప్ డేట్స్ విషయంలో అప్డేట్ అయితే మంచిది.