సినిమా అంటే సమిష్టి కృషి. అందరూ కలసి కట్టుగా పనిచేయాలి. ఒకరి కోసం ఒకరన్నట్టుగా కష్టపడాలి. అప్పుడే మంచి ఫలితాలొస్తాయి. సినిమా కోసం ఇక్కడ ఈగోల్ని కూడా పణంగా పెట్టాలి. అయితే ఇది అన్నిసార్లూ సాధ్యం కాకపోవొచ్చు. ఎక్కువ తక్కువల గొడవలు మొదలైతే – సమిష్టిగా కలసి పనిచేయడం కల్లే. ప్రస్తుతం సైరా టీమ్‌లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. చిరంజీవి 151వ చిత్రంగా తెరకెక్కుతోంది ‘సైరా – నరసింహారెడ్డి’. సురేందర్ రెడ్డి దర్శకుడు. సూరికి ముందు నుంచీ ఓ అలవాటు ఉంది. తన టీమ్‌లో తనకు బాగా ట్యూనింగ్ కుదిరిన వాళ్లనే పెట్టుకొంటాడు. అయితే సైరా విషయంలో అది సాధ్యం కాలేదు. చిరు. చరణ్‌ల కోసం కొన్ని విషయాలకు తల వంచాల్సివచ్చింది. చిరు కోసం పరుచూరి బ్రదర్స్‌ని టీమ్‌లోకి తీసుకొన్నాడు. మాటల రచయితగా సాయిమాధవ్ బుర్రాని తీసుకోవాలన్నదీ చిరు సూచనే. అయితే వీరిద్దరితోనే సురేందర్‌రెడ్డి కాస్త ఇబ్బంది పడుతున్నాడని టాక్.
ఈ సినిమాని సురేందర్ రెడ్డి చేతిలో పెట్టక ముందే… పరుచూరి వారు స్క్రిప్టు తయారు చేసేశారు. డైలాగులతో సహా. ఎప్పుడైతే సూరి వచ్చాడో స్క్రిప్టు మారింది. తనకు కావల్సినట్టుగా సీన్లు మార్చుకొన్నాడు. దాని కోసం కొంత రిసెర్చ్ కూడా చేశాడు. ధృవ హిట్‌తో జోరుమీదున్నాడు కాబట్టి సూరి మాటలు చెల్లుబాటు అవుతున్నాయి. స్క్రిప్టు విషయంలో అటు సూరికీ, ఇటు పరుచూరి వారికీ కాస్త బేదాభిప్రాయాలు వచ్చాయన్నది టాక్. డైలాగులు కూడా అంతే. బుర్రా సాయిమాధవ్ రాసిన సంభాషణల్ని సూరి తనకు నచ్చినట్టు మార్పించుకొంటున్నాడట. దాంతో ఆయనా కాస్త అలిగినట్టు తెలుస్తోంది. కెమెరా మెన్‌గా ఎంచుకొన్న రవివర్మన్ ఎప్పుడు ఈ టీమ్ నుంచి బయటకు వెళ్లిపోదామా అని చూస్తున్నాడని టాక్. ఎందుకంటే ఈ సినిమా ఎప్పుడో మొదలుకావల్సివుంది. ఇప్పటికి కనీసం 20 శాతం షూటింగ్ అయిపోవాలి. కానీ… ఇంకా పట్టాలెక్కలేదు. ఈ సినిమాతో పాటు ఒప్పుకొన్న కొన్ని సినిమాలు చేతిలోంచి చేజారిపోయే ప్రమాదం వచ్చిందని టాక్.
సెట్స్ విషయంలోనూ ఇలాంటి సమస్యలే ఉత్పన్నం అవుతున్నాయని తెలుస్తోంది. మొత్తానికి `సైరా` మొదలవ్వకముందే రాంగ్ సిగ్నల్స్ పంపడం మొదలెట్టింది. టీమ్‌లో ఉన్న ఈ లుకలుకలు తగ్గించాల్సిన బాధ్యత చిరంజీవిపై పడింది. చిరు ఇటీవల `సైరా` పనుల్ని పక్కన పెట్టి వ్యక్తిగత వ్యవహారాల్లో బిజీ అయ్యారని, ఆయన ఒక్కసారి మళ్లీ ఈ సినిమాపై దృష్టి పెడితే ఇలాంటి సమస్యలు ఉండవని తెలుస్తోంది. ఈ టీమ్‌ని ఒకే తాటిపై నడిపించాల్సిన బాధ్యత చిరంజీవిపైనే ఉందిక.